బీజేపీ (BJP)లో జనసేన (Janasena) చిచ్చు పెట్టింది. నాగర్ కర్నూల్ సీటు జనసేనకు కేటాయిస్తారంటూ వార్తలు రావడంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అసలు జిల్లాలో జనసేన ఉనికే లేదని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అలాంటిది అక్కడ జనసేనకు ఎలా టికెట్ కేటాయిస్తారంటూ అధిష్టానం నిర్ణయంపై బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
జనసేనకు నాగర్ కర్నూల్ సీటు ఇవ్వొద్దంటూ బీజేపీ నేత దిలీప్ చారి ఆధ్వర్యంలో కార్యకర్తలు బీజేపీ స్టేట్ ఆఫీస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నాగర్ కర్నూల్ సీటును జనసేనకు కేటాయిస్తారంటూ వస్తున్న వార్తలతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన రేకెత్తించిందని దిలీప్ చారి అన్నారు. తాము నిరసనలు తెలిపేందుకు రాలేదని స్పష్టం చేశారు. కేవలం తమ బాధను రాష్ట్రపార్టీ దృష్టికి తీసుకు వచ్చేందుకు వచ్చామన్నారు.
జనసేనను రంగంలోకి దించితే పార్టీకి వచ్చే లాభం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలో ఎప్పటి నుంచో మంత్రి అక్రమాలకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని దిలీప్ చారీ గుర్తు చేశారు. మంత్రి అక్రమాలను ప్రశ్నించి ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ నేతలకు కాకుండా జనసేనకు టికెట్ ఇవ్వడం సరికాదన్నారు. జనసేనకు టికెట్ కేటాయిస్తున్న వార్త నిజమైతే ఆత్మహత్య చేసుకునే ఆలోచనలో బీజేపీ కార్యకర్తలు ఉన్నారని తెలిపారు.
జిల్లాలో ఐదేండ్లుగా యుద్ధం చేశామన్నారు. అలుపెరగని పోరాటం చేస్తున్న బీజేపీ శ్రేణుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా, ప్రజల్లో చులకన భావం వచ్చే విధంగా జనసేనకు టికెట్ కెటాయిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంతకన్నా అవమానకరమైన విషయం మరొకటి లేదన్నారు. జనసేనకు టికెట్ కేటాయించడం లేదని స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పార్టీ కార్యాలయంలోనే ఉంటామన్నారు.