బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై సీఎల్పీ (CLP) నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ కావాలంటే బీఆర్ఎస్ (BRS) గెలిపించాలని.. బతకాలంటే మాత్రం కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావాలని వెల్లడించారు. రాజ్యాధికారం కోసం ఎన్ని లక్షల మంది జీవితాలను బలి చేస్తారని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు భట్టి..
పాలన చేతకాని బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలలో నిప్పులు కురిపించిదని భట్టి విమర్శించారు. కేసీఆర్ తో పాటు ఆయన కొడుకు, కూతురు, అల్లుడు కాంగ్రెస్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. దొరల పాలనలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని, పదేళ్ల నుంచి రాష్ట్ర సంపదను దోచుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టె సమయం వచ్చిందని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే ఎన్నికల సమయంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భట్టి పేర్కొన్నారు. ఇక మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భట్టి విక్రమార్క.. ఎడవెల్లి గ్రామంలో ఉన్న శ్రీలక్ష్మి నరసింహ స్వామి (Sri Lakshmi Narasimha Swamy) దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.