బీజేపీ (BJP), జనసేన (Janasena) పొత్తు, కేటాయించే స్థానాలపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చినట్టు సమాచారం. 11 స్థానాలను జనసేనకు కేటాయించినట్టు తెలుస్తోంది. రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కూకట్ పల్లి (Kukatpalli), శేరిలింగంపల్లి (Serilingampalli) విషయంలోనూ క్లారిటీ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కూకట్ పల్లి స్థానాన్ని జనసేనకు కేటాయించిన బీజేపీ.. కీలకమైన శేరిలింగంపల్లి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో సీనియర్ నేత గజ్జల యోగానంద్ (Gajjala Yoganand) కు లైన్ క్లియర్ అయిందని అంతా అనుకుంటున్నారు.
శేరిలింగంపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు యోగానంద్. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. శేరిలింగంపల్లి జనసేనకు కేటాయిస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు యోగానంద్ అభిమానులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. కీలకమైన శేరిలింగంపల్లి నుంచి బీజేపీనే పోటీ చేయాలని, అదికూడా యోగానంద్ ను బరిలోకి దింపాలని డిమాండ్ వినిపిస్తూ వస్తున్నారు.
హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో శనివారం యోగానంద్ కే టికెట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకులను కలిశారు పార్టీ కార్యకర్తలు, యోగానంద్ అభిమానులు. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం అయిన శేరిలింగంపల్లిలో బీజేపీ బలోపేతం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని వారి దృష్టికి తీసుకెళ్లారు. అందుకే, యోగానంద్ కి టికెట్ ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకులను కలిసి నియోజకవర్గ ప్రజల నాడిని తెలియజేశారు.
శేరిలింగంపల్లిలో పార్టీ అభివృద్ధికి క్రియా శీలక పాత్ర పోషించిన గజ్జల యోగానంద్.. అభ్యర్థిత్వానికి మద్దతుగా జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులు, క్రమశిక్షణతో, నిబద్ధతతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగానంద్ కి టికెట్ ఇస్తే.. భారీ మెజారిటీతో తప్పక గెలిపించుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా మన శేరిలింగంపల్లి-మన యోగానంద్ ప్లకార్డులను ప్రదర్శించారు. భారత్ మాతాకీ జై నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.