సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కళాబృందం ఎంతగా ప్రచారం చేస్తున్నానేరాలు, మోసాలు మాత్రం ఆగడం లేదు. అమాయకులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు వలలు విసురుతున్నారు. ఈ కేటుగాళ్లు ఎవరిని వదిలిపెట్టడం లేదు.. చివరికి అధికారులు, ప్రజాప్రతినిధులకి కూడా సవాల్ గా మారుతున్నారు. కాగా తాజాగా సిద్ధిపేట పోలీస్ కమిషనర్‌కు సవాల్ విసిరారు సైబర్ క్రిమినల్స్ (Cyber criminals)..
సిద్ధిపేట (Siddipet) పోలీస్ కమిషనర్ (Police Commissioner) శ్వేత (Shweta) సెల్ నెంబర్ 9934941611 పై ఫేక్ ఐడీ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఈ ఐడీ ద్వారా పలువురికి మెసేజ్‌లు పంపిస్తున్నారు.. అత్యవసరంగా రూ.30వేలు పంపించమని, తిరిగి గంట లోపు ఇస్తానని ఫేక్ ఐడీ ద్వారా కోరుతున్నారు. మరోవైపు పోలీస్ కమిషనర్ డబ్బులు అడగడం ఏంటని ఈ మెసేజ్‌లు చూసిన ప్రజలు, పోలీస్ అధికారులు అశ్చర్యపోతున్నారు.
ఈ నేరగాళ్ల లీలలు పోలీస్ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే అప్రమత్తమైన ఆమె తగిన చర్యలు చేపట్టారు. తన పేరు మీద ఏవైనా మెసేజ్‌లు వస్తే ఎవరూ స్పందించ వద్దని పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.