ఖమ్మం (Khammam) రాజకీయాలు రోజురోజుకు ముదిరి పోతున్నాయి. ఇక్కడి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల సెగలు మంటలు కక్కుతున్నాయి. ప్రత్యర్థి ఓటమి లక్ష్యంగా ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)పై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvwada Ajay Kumar) మరోసారి విమర్శలకి దిగారు. ఖమ్మంలో సీనియర్ నాయకుడినని గొప్పలు చెప్పుకునే తుమ్మల.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పువ్వాడ మండిపడ్డారు.
మరోవైపు ఖమ్మంలో దొంగ ఓట్ల వ్యవహారంపై తుమ్మల ఈసీకి ఫిర్యాదు చేయడం వివాదానికి దారితీసింది. ఈ ఘటన పై స్పందించిన పువ్వాడ.. కక్షపూరితంగానే మమత కళాశాలల విద్యార్థుల ఓట్లపై తుమ్మల ఈసీకి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం పర్యటన అనంతరం ఇక్కడి రాజకీయాలు సలసల కాగుతున్న నూనెలా మారాయని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్.. బీఆర్ఎస్ (BRS) నుంచి పోటీ చేస్తుండగా.. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ (Congress) నుంచి సమరానికి సిద్దం అయ్యారు. 2014 లో తలపడ్డ ఈ ఇద్దరు మరోసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. ఇక 2014లో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పువ్వాడ అజయ్ తుది విజయం సాధించారు..
అనంతరం ఇద్దరూ బీఆర్ఎస్లో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో పాలేరు సీటు ఆశించిన తుమ్మలకు బీఆర్ఎస్ హ్యాండ్ ఇచ్చింది. దీంతో తుమ్మల హస్తం చేయి అందుకున్నారు.. అప్పటి నుంచి ఖమ్మం రాజకీయ పోరు రసవత్తరంగా మారింది.