తెలంగాణ (Telangana) ఎన్నికల నేపథ్యంలో ఓవైపు నాయకులు ప్రచారంలో మునిగిపోగా.. ఇంకోవైపు అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఈనెల 30న ఎలక్షన్ నేపథ్యంలో బందోబస్తుపై ఫోకస్ పెట్టారు తెలంగాణ అధికారులు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు (Tamilanadu) రాష్ట్ర ప్రభుత్వానికి సీఎస్ శాంతి కుమారి (CS Santi Kumari) లేఖ రాశారు. ఎన్నికల భద్రతా విధులు చేపట్టేందుకు 5 వేల మంది పోలీసులను పంపించాలని లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ వినతి నేపథ్యంలో తమిళనాడు డీజీపీ వన్నియ పెరుమాళ్ అన్ని జిల్లాల ఎస్పీలకు సర్క్యులర్ పంపించారు. తెలంగాణ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న పోలీసులను పంపాలని సూచించారు. ఈనెల 27వ తేదీకి తెలంగాణకు వారిని పంపాలని డీజీపీ పేర్కొన్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో తమిళనాడు పోలీసులు పహారా కాయనున్నారు.
మరోవైపు, ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వికలాంగులు, వృద్ధులను ఓటు వేసేందుకు తీసుకొచ్చే సహాయకుల చేతి వేలుకు ఇంక్ గుర్తు పెట్టాలని నిర్ణయించింది. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు వేస్తుంటారు. అయితే.. ఈసారి నుంచి సహాయకులుగా వచ్చే వారి కుడి చేతి చూపుడు వేలుకు ఇంక్ వేయాలని ఈసీ నిర్ణయించింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.