ఐటీ (IT) దాడులు జరగొచ్చని కాంగ్రెస్ (Congress) అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అనుమానం వ్యక్తం చేసిన 48 గంటల లోపే అధికారులు ఆయన్ను టార్గెట్ చేశారు. ఖమ్మం, హైదరాబాద్ లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఖమ్మంలో 5, హైదరాబాద్ లో 10 ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి బంధువులు, కీలక ఉద్యోగుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
ఐటీ దాడుల నేపథ్యంలో పొంగులేటి కుటుంబ సభ్యులంతా ఖమ్మంలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు కూడా తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఎంటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు వచ్చిన ఐటీ అధికారులు అందరి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఐటీ దాడులపై పొంగులేటి స్పందించారు. దీన్న తాను ముందే ఊహించానన్నారు. కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టాలనే ఐటీ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయన్నారు. బీజేపీలోకి రావాలని తనపై ఒత్తిడి చేశారని.. అది కుదరకపోవడం, కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిపోవడంతో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తే ఐటీ దాడులు జరుగుతాయని తెలుసన్నారు.
తాను ఏ తప్పూ చేయలేదన్న పొంగులేటి.. ఉద్దేశపూర్వకంగానే నామినేషన్ వేసే రోజు సోదాలు జరపడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉదయం నుంచి చాలా ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారన్నారు. చివరికి తనను జైలులో పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని తెలిపారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు జైలులో ఉండేందుకైనా సిద్ధమని స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.