అక్రమ మద్య సరఫరాకు అడ్డుకట్ట వేస్తున్నాం.. సారా నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాం’ అంటూ సర్కారు పదే పదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా బెల్టుషాపులు వెలుస్తున్నాయి. నాటుసారా ఏరులైపారుతోంది. ఎన్నికల వేళ రాజకీయ నాయకులు తక్కువ ధరకే సారాయి లభించడంతో ఓటర్లను ఆకర్షించుకోవడానికి మత్తులో దించేందుకు సారా కేంద్రాల వైపు మొగ్గుచూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని మారుముల ప్రాంతం తట్టేపల్లి గ్రామానికి పక్కనే కర్ణాటక రాష్ట్రం అనుకుని ఉండడంతో అక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో కొంత మంది సారాయి తయారు కేంద్రాలను సృష్టిస్తున్నారు. అయితే, తాజాగా తట్టేపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో సారాయి తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు అనే సమాచారంతో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి స్థానిక పోలీసులు సోదాలు చేసి సారా తయారు చేస్తున్న బట్టిలో 250 లీటర్ల బెల్లం పానకాన్ని, సారాయి తయారీకి ఉపయోగించే వస్తువులను ధ్వంసం చేశారు.
ఈ దాడుల్లో 20 లీటర్ల సారాని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సారా బట్టిని ఏర్పాటు చేసిన రాంజీ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, టాస్క్‌ఫోర్స్ అధికారులు, స్థానికులు, పోలీసులు కలిసి దాడులు నిర్వహిస్తున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెట్టినట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం వారు క్షేత్రస్థాయిలో కూడా పర్యవేక్షించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ సరిహద్దులో ఈ ప్రాంతం ఉండడంతో ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొరవడం వల్ల కిందిస్థాయి ఎక్సైజ్ అధికారులు సారా కేంద్రాలకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తక్కువ ధరకే ఈ సారా దొరకడంతో పాటు ఎన్నికల టైం కావడంతో గ్రామాల్లో సారా జోరు పెరిగి తాగిన మత్తులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే అవకాశం ఉన్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు, పేదలు రోజంతా కష్టపడగా వచ్చిన కూలిని నాటుసారాకు ఖర్చుపెడుతున్నారు. మద్యంతో పోలిస్తే ధర తక్కువ కావడంతో సారానే ఎక్కువగా సాగి ప్రాణాలకు ముంపు తెచ్చుకుంటున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతవాసులకు సారాయితో కలిగే అనర్థాలపై అధికారులు అవగాహన కల్పించాలని ప్రజా సంఘాల నాయకులు, జిల్లావాసులు కోరుతున్నారు.