తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు పోటాపోటీగా బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ రాకపోవడంతో ఆశావహులు తమ బలగంతో బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress)లోకి భారీగా వలసలు వెళుతున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలపై సంబంధిత పార్టీ మారుతున్నట్లు ఎలాంటి ప్రకటన చేయకుండా దుష్ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత(Congrees party Senior Leader) అద్దంకి దయాకర్ (Addanki dayakar) ఆ పార్టీని వీడుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దీంతో ఈ వార్తలకు అద్దంకి దయాకర్ చెక్ పెట్టారు. ఇది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విష ప్రచారం అని.. ఈ వార్తలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఈ మేరకు ట్విట్టర్ (X) వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు.
ఇలాంటి సమయంలో అందరూ ఓపిగ్గా ఉండాలని దయాకర్ సూచించారు. సోషల్ మీడియాలో నకిలీ వార్తలను ప్రచారం చేయడం వెనుక అధికార బీఆర్ఎస్ పాత్ర ఉందని ఆరోపించారు. ‘కాంగ్రెస్ పార్టీ నాకు అండగా ఉందని.. బీఫాం నాకే వస్తుంది..’ అంటూ తెలిపారు. నవంబర్ 10వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.
‘తుంగతుర్తి నియోజకవర్గం విషయంలోనే కాదు.. నా విషయంలోనూ కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడూ వ్యతిరేకంగా లేదు.. కాంగ్రెస్ పార్టీని, నన్ను బదనాం చేయడానికి బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర ఇది.. కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం అనుకూలంగానే ఉంది.. అందర్నీ సమన్వయం చేసుకుని పోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి.’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.