తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీ, ఎమ్మెల్యేలపై (MP,MLAs)ను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రతినిధులపై దాఖలైన కేసులను అత్యంత త్వరిత గతిన పరిష్కరించాలని దేశ వ్యాప్తంగా ఉన్న హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న ట్రయల్ కోర్టులకు ఏకరీతి మార్గదర్శకాలను రూపొందించడం చాలా కష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. అరుదైన కేసులను మినహాయిస్తే తీవ్ర నేరాల్లో విచారణను వాయిదా వేయరాదని ట్రయల్ కోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. క్రిమినల్ కేసుల్లో చట్టసభ సభ్యులపై విచారణల స్థితిగతులపై నివేదికల కోసం దిగువ న్యాయ స్థానాల సహాయాన్ని తీసుకోవచ్చని సూచించింది.
ఎంపీలు, ఎమ్మెల్యేల విచారణ చేపట్టే ప్రత్యేక న్యాయస్థానాలకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, సాంకేతిక సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని జిల్లా న్యాయమూర్తులను సర్వోన్నత న్యాయస్థానం కోరింది. మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణలను పర్యవేక్షించి, త్వరగా పరిష్కరించేందుకు హైకోర్టులు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
కేసుల సత్వర పరిష్కారం కోసం ఓ వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తీవ్రమైన నేరాల్లో దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించే అంశంపై విస్తృతంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.