హైదరాబాద్-విజయవాడ(Hyderabad-Vijayawada) జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్(Traffic Jam) ఏర్పడింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో హైవే విస్తరణ పనులు జరుగుతుండడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి సుమారు 5 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు. నిత్యం బిజీగా ఉండే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఒక్క వాహనం ఆగినా, ఏదైనా ప్రమాదం జరిగినా భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. ముఖ్యంగా వారాంతాల్లో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన ప్రయాణికులకు అవస్తలు పడ్డారు.
రహదారిని నగరంలోని చింతల్‌కుంట కూడలి నుంచి ఆందోల్‌మైసమ్మ (దండు మల్కాపూర్) వరకు ఆరు వరుసల మేర విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి మొత్తం 22.5 కిలోమీటర్ల మేర పనులను రూ.541 కోట్లతో చేపడుతోంది. ప్రస్తుతం పెద్ద అంబర్‌పేట, బాటసింగారం, ఇనామ్‌గూడ దగ్గర రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది లేకుండా సర్వీసు రోడ్లు ముందు పూర్తి చేసి వాటి మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు.
అయితే ఈ మళ్లించే చోట రోడ్లు ఇరుకుగా ఉండటంతో అప్పటివరకూ వేగంగా వచ్చే వాహనాలు నెమ్మదించాల్సి వస్తోంది. దీంతో ఒక్కసారిగా వాహనాలు బారులు తీరుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి సుమారు 5కి.మీ మేర వాహనాలు నిలిచిపోవడం రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు.