దీపావళి పండుగ(Diwali Festival)ను యావత్ భారత్ ఎంతో ఘనంగా నిర్వహించుకుంటుంది. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించుకునే పండుగ దీపావళి. నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగగా ప్రతీతి. అయితే ఓ మూడు గ్రామాలు మాత్రం దీపావళి పండుగను దశాబ్దాలుగా చేసుకోవడంలేదు.
పంజాబ్(Punjab) రాష్ట్రం బఠిండా జిల్లాలోని మూడు గ్రామాలు దీపావళి పండుగకు దూరంగా ఉన్నాయి. దీనికి కారణం ఈ ప్రాంతంలో ఆర్మీ కంటోన్మెంట్, మందుగుండు సామగ్రి డిపో ఉండటమే. దాదాపు 50ఏళ్లకు పైగా ఈ గ్రామాలు దీపావళి పండగకు దూరంగా ఉండిపోతున్నాయి. పంజాబ్‌లోని పూస్ మండి, భగు, గులాబ్ గఢ్ గ్రామాల్లో బాణసంచా పేల్చడం, పంట వ్యర్థాలను కాల్చడంపై నిషేధం విధించింది ప్రభుత్వం.
ఈ మూడు గ్రామాలు దాదాపు ఐదు దశాబ్దాలుగా అక్కడ దీపావళి పండుగను జరుపుకోవడంలేదని స్థానికులు చెబుతున్నారు. నిబంధనలను విరుద్ధంగా ఎవరైనా టపాసులను, పంట వ్యర్థాలను కాలిస్తే.. అంతే. జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
దీనికి తోడు కంటోన్మెంట్ ప్రాంతంలో కొత్త నిర్మాణాలు చేపట్టకుండా నిషేధం ఉందన్నారు. ఆర్మీ కంటోన్మెంట్ ఉండటం, సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల తమ భూముల ధరలు కూడా పెరగలేకపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల పండుగల సందర్భాల్లో బంధువులు కూడా తమ ఇళ్లకు వచ్చేందుకు ఇష్టం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల గత 50 సంవత్సరాలుగా దీపావళి పండగ జరుపుకోలేకపోతున్నామన్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది దసరా పండుగలాగే దీపావళి పండుగ మహూర్తాలు రెండురోజులు ఉన్నాయి. దీపావళి పండుగ నవంబరు 12, 13 ఆది, సోమవారాల్లో వస్తోంది. దీంతో తెలంగాణలో దీపావళి సెలవు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత ఈనెల 12 ఆదివారం రోజు దీపావళి సెలవు ఉండగా, ఉద్యోగ సంఘాల విన్నపం మేరకు ఈనెల 13వ తేదీకి సెలవును మార్చింది. దీంతో సోమవారం సెలవు దినం కానుంది.