అసెంబ్లీ సాక్షిగా తనపై బీహార్ సీఎం నితీశ్‌కుమార్ విమర్శలు చేయడాన్ని హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) పార్టీ అధ్యక్షుడు జితన్‌రామ్ మాంఝీ తప్పుపట్టారు. నితీశ్‌కుమార్ సీఎం కుర్చీని లాక్కునేందుకు ఆయన తినే ఆహారంలో ఎవరో విషం కలిపి ఉంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషం ప్రభావంతోనే ఆయన రెండు రోజుల క్రితం మహిళల గురించి, నిన్న నా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మాంఝీ ఆరోపించడం వివాదాస్పదమైంది.
బీహార్ అసెంబ్లీలో కుల గణన నివేదికపై చర్చ సందర్భంగా జితన్‌రామ్ మాంఝీ ఈ వ్యాఖ్యలు చేశారు. మాట్లాడుతూ.. కుల గణన సర్వే సక్రమంగా జరిగనట్లు తనకు అనిపించడంలేదని, ఒకవేళ ఆ డేటాలో తప్పులు ఉంటే సంక్షేమ ఫలాలు అసలైన లబ్ధి దారులకు దక్కకుండా పోతాయని అన్నారు.
అదేవిధంగా బీహార్‌లో నిర్వహించిన కులగణనకు సంబంధించిన నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా నితీశ్‌కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘భర్తల చర్యల వల్ల జననాలు పెరిగాయి. అయితే చదువుకున్న మహిళలకు తమ భర్తలను ఎలా నియంత్రించాలో తెలుసు. అందుకే ఇప్పుడు జననాల రేటు తగ్గుతూ వస్తున్నది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమనడంతో నితీశ్ క్షమాపణలు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాంఝీ ఇవాళ నితీశ్ మానసిక స్థితిని ఎగతాళి చేశారు.
జితన్‌రామ్ మాంఝీ వ్యాఖ్యలపై నితీశ్ స్పందిస్తూ.. ‘2014లో మాంఝీని మేం సీఎంను చేశాం. నేను సీఎంగా పనిచేసిన అని ఆయన ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఆయనకు ఏమైనా పరిజ్ఞానం ఉన్నదా..? ఏదో నా మూర్ఖత్వం వల్ల నాడు సీఎం అయ్యారు’ అని వ్యాఖ్యానించారు.