తెలంగాణలో నామినేషన్ల (Nominations) పర్వం నేటితో ముగిసింది. చివరి రోజు పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అందులో మునుగోడు (Munugodu) అసెంబ్లీ స్థానానికి ఓ నిరుద్యోగి నామినేషన్ వేసిన తీరు అందరినీ ఆలోచింపజేసింది. చండూరులో బిక్షాటన చేస్తూ నామినేషన్ వేసిన ఘటన అందరిని కదిలించింది.
నామినేషన్ వేసేందుకు వెళ్తూ పులిపలుపులకు చెందిన కంభంపాటి సత్యనారాయణ అందరి దగ్గర బిక్షాటన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గజ్వేల్, సిద్దిపేటలాగా మునుగోడును ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఓటేస్తే బిచ్చగాళ్లు అవుతారంటు హెచ్చరికలు చేశారు.
తెలంగాణ వస్తే ప్రజల బతుకులు మారుతాయని తాము అనుకున్నామని చెప్పారు. అందుకే ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేక పోవడంతో యువత బిచ్చగాళ్లుగా మారిపోయారని వాపోయారు. మొదట్లో ఇంటికో ఉద్యోగం అన్న సీఎం కేసీఆర్.. ఆ తర్వాత ఇంటికో కాటన్ మద్యం సప్లయ్ చేస్తున్నాడంటూ మండిపడ్డారు.
గజ్వేల్, కామారెడ్డిలో నిరుద్యోగులంతా కలిసి కేసీఆర్ ను ఓడించి తీరుతామన్నారు. కేసీఆర్‌ను రాజకీయ నిరుద్యోగిగా మార్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతోందన్నారు. కానీ లిక్కర్ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు నెలల ముందే నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు.