భారత్ (India), అమెరికా (USA) మధ్య 2+2 మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరు దేశాల మంత్రులు చర్చించారు. డ్రాగన్ కంట్రీ నుంచి భారత్‌కు పెరుగుతున్న భద్రతా పరమైన సవాళ్లపై ఈ సమావేశంలో చర్చించినట్టు అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్ (lloyd austin) వెల్లడించారు. సైనికులకు ఉపయోగపడే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేయాలని ఇరు దేశాలు సంయుక్తంగా నిర్ణయించాయన్నారు.
రెండు దేశాల మధ్య బంధం గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత బలంగా ఉందన్నారు. అంతరిక్షం నుంచి మొదలు సముద్ర గర్భం వరకు పలు రంగాల్లో భారత్తో అమెరికా కలిసి పనిచేస్తోందన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా, ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితుల గురించి ఈ సందర్బంగా చర్చించామని లాయిడ్ అస్టిన్ వెల్లడించారు.
చైనాతో భారత్‌కు పెరుగుతున్న భద్రతా సవాళ్లపై చర్చించామని పేర్కొన్నారు. తాను, తమ విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్ భారత కేంద్ర మంత్రులతో ఫలవంతమైన చర్చలు జరిపామన్నారు. అమెరికా నుంచి భారత్ 31ఎంక్యూ-9బీ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం గురించి త్వరలో వెల్లడిస్తామన్నారు.
ఇది ఇలా వుంటే జీ20 సమావేశాల నిర్వహణకు సహకరించినందుకు అగ్రరాజ్యం అమెరికాకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. జీ-20ని భారత్ విజయవంతంగా నిర్వహించిందన్నారు. అమెరికా వల్లే ఈ సదస్సులో ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. అందుకే అమెరికా అధ్యక్షుడు, ప్రభుత్వానికి ప్రధాని మోడీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు.