Telugu News » Chandramohan: చంద్రమోహన్ మృతి పట్ల ప్రముఖుల నివాళి…!

Chandramohan: చంద్రమోహన్ మృతి పట్ల ప్రముఖుల నివాళి…!

విలక్షణ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు x(ట్విట్టర్) వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రమోహన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) సంతాపం తెలిపారు.

by Mano
Chandramohan: Celebrities pay tribute to Chandramohan's death...!

విలక్షణ నటుడు చంద్రమోహన్(Chandra Mohan)​ కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్​ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు x(ట్విట్టర్) వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రమోహన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) సంతాపం తెలిపారు.

Chandramohan: Celebrities pay tribute to Chandramohan's death...!

‘విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరనిలోటు.. ‘వారి స్పూర్తితో ఎందరో నటీ నటులు ఉన్నత స్థాయికి ఎదిగాలని.. కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని చంద్రమోహన్ సొంతం చేసుకున్నారు’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అదేవిధంగా చంద్రమోహన్ మృతిపట్ల ఏపీ సీఎం జగన్ స్పందిస్తూ.. ‘ ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడం విషాదకరం. తొలి సినిమాకే నంది అవార్డు గెలుచుకున్నారయన.  తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.’ అంటూ జగన్ పేర్కొన్నారు.

అదేవిధంగా టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్​ చిరంజీవి ట్విట్టర్​ వేదికగా చంద్రమోహన్​కు సంతాపం తెలిపారు. ‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు. ఆయన ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ లో ఒక మూగవాడి పాత్రలో ఆయన అద్భుతమైన నటనను ప్రదర్శించారు.

మా తొలి పరిచయం ‘ప్రాణం ఖరీదు’తొ మొదలైంది. ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.’ అంటూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు.

అదేవిధంగా చంద్రమోహన్ మృతిపట్ల జనసేన అధినేత, సినీ హీరో పవన్‌కల్యాణ్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ‘చంద్రమోహన్ మరణ వార్త విని ఆవేదన చెందాను. ఆయనను తెరపై చూడగానే మనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిని చూస్తున్నట్లు ఉంటుంది. వారితో మా కుటుంబానికి స్నేహబంధాలున్నాయి. తమ్ముడులో మా ఇద్దరి మధ్య అలరించే సీన్స్‌ ఉన్నాయి. చంద్రమోహన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.’ అని పేర్కొన్నారు.

 

You may also like

Leave a Comment