మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో ఎమ్మార్పీఎస్ (MRPS)వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) భావోద్వేగానికి గురయ్యారు. వేదికపై మందకృష్ణ మాదిగను ప్రధాని మోడీ కౌగిలించుకున్నారు. దీంతో మందకృష్ణ మాదిగ ఒక్క సారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే మందకృష్ణ భుజంపై ప్రధాని మోడీ చేయి వేసి ఓదార్చారు.
అనంతరం మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ….. దశాబ్దాలుగా మాదిగలను ఈ సమాజం మనుషులుగా చూడలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమను పశువుల కన్నా అత్యంత హీనంగా చూశారంటూ తీవ్రంగా వాపోయారు. దళితుల సమావేశానికి ఇంత వరకు ఏ ప్రధాని కూడా రాలేదన్నారు.
కానీ తమకు ధైర్యం చెప్పేందుకు ఈ రోజ ప్రధాని మోడీ వచ్చారంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఓ దళిత వ్యక్తిని రాష్ట్రపతిగా చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని తెలిపారు. దళితులను కేసీఆర్ అణచి వేశారని అన్నారు. కానీ ప్రధాని మోడీ మాత్రం దళితులకు అవకాశాలు ఇచ్చారన్నారు.
సామాజిక న్యాయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కేవలం మాటలు మాత్రమే చెబుతున్నాయని తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేసీఆర్ కేబినెట్లో ఒక్క మాదిగ మంత్రి లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క శాతం కూడా లేని వెలమలకు 4 మంత్రి పదవులు ఇచ్చారని తీవ్రంగా ధ్వజమెత్తారు. దళితుల ఆకాంక్షలు నేరవేర్చేది బీజేపీనేనని అన్నారు.