– గులాబీ గూటికి పాల్వాయి స్రవంతి
– కేటీఆర్ సమక్షంలో చేరిక
– కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్
– ఎన్నో అవమానాలు పడ్డానన్న స్రవంతి
కాంగ్రెస్ (Congress) కు గుడ్ బై చెప్పిన పాల్వాయి స్రవంతి (Palvai Sravanthi) బీఆర్ఎస్ (BRS) గూటికి చేరారు. మంత్రి కేటీఆర్ (KTR) ఆమెకు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ.. గౌరవం లేని చోట ఉండకూడదని తన నాన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (Palvai Govardhan Reddy) చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ లో అడుగడుగునా అవమానాలు పడ్డానని అన్నారు. మొదట్నుంచి నిబద్దతతో పని చేస్తున్న వారిని తొక్కేశారని మండిపడ్డారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత బీఆర్ఎస్ లో చేరానన్న ఆమె.. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడిన కేసీఆర్ (KCR), కేటీఆర్ సారథ్యంలో పని చేస్తానని స్పష్టం చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ… రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) ఏ అవసరం కోసం పార్టీలు మారుతున్నారో ఆయనకే తెలియాలని అన్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో గోవర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి రమ్మని కేసీఆర్ అడిగితే.. తాను కాంగ్రెస్ వాదిని అని చెప్పారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి కూతురిని కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు. ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ నుంచి ఎవరూ పోటీ చేసేందుకు ముందుకు రాకపోతే.. స్రవంతి ధైర్యం చేసి బరిలో నిలిచారన్నారు. ఆ వచ్చిన కొద్ది ఓట్లు కూడా ఆమెను చూసి వేసినవేనని తెలిపారు. స్రవంతితో కలిసి పార్టీలోకి వచ్చిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. మునుగోడు నియోజకవర్గంలో అందరూ సమిష్టిగా కష్టపడాలని.. డబ్బు మదంతో ఉన్న రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలని సూచించారు.
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కీలక నేతగా ఉండేవారు పాల్వాయి స్రవంతి. అంతకుముందు వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్రీయాశీలకంగా వ్యవహరించారు. ఆయన బీజేపీ గూటికి వెళ్లడంతో ఉప ఎన్నికలో స్రవంతి పోటీ చేశారు. అప్పట్లో మూడో స్థానంలో నిలిచారు. అయితే.. ఈమధ్య బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు టికెట్ ఇచ్చి మరీ వెల్ కమ్ చెప్పింది అధిష్టానం. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు పాల్వాయి స్రవంతి. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు తన లాంటి వారు నియోజకవర్గంలో పార్టీకి అండగా ఉన్నామని, అలాంటిది తమనే విస్మరిస్తే ఎలా అని ఆమె అసహనం వ్యక్తం చేశారు. శనివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు.
కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు స్రవంతి. ప్రతి కార్యకర్త తన బాధ, భావోద్వేగం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కార్పొరేట్ పార్టీగా మారిపోయిందని ఆరోపించారు. ఒక దళారీ చేతిలో పార్టీ నడుస్తుందంటూ భగ్గుమన్నారు. పారాచూట్లకు తావులేదంటూ 50 మంది పైగా అభ్యర్థులకు టికెట్లు అమ్ముకుని కాంగ్రెస్ బ్రోకర్ పార్టీగా మారిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చచ్చిపోయిందని పార్టీ వీడి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి మళ్లీ వస్తే కండువా కప్పారని.. 24 గంటల్లో మునుగోడు టికెట్ ప్రకటించారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించిన ఆమె.. ఆదివారం కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.