తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతల మధ్య వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇప్పటి వరకు నోటితో విమర్శలు చేసుకున్న వారు.. హద్దులు దాటి దాడులు చేసుకునే వరకు వ్యవహారం వెళ్ళిందని జనం అనుకుంటున్నారు. కాగా నిన్న రాత్రి బీఆర్ఎస్ (BRS) కాంగ్రెస్ (Congress) కార్యకర్తల మధ్య జరిగిన గొడవ రచ్చ రచ్చగా మారుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇలాంటి గోడవలతో రాజకీయ లబ్ధి పొందాలని నేతలు చూస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అచ్చంపేట గోడవపై టీపీసీసీ (TPCC) సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి (Mallu Ravi) స్పందించారు. అచ్చంపేట (Achampeta)లో జరిగిన గొడవ పై పార్టీ తరపున ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. మరోవైపు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju)పై మల్లురవి మండిపడ్డారు..
అచ్చంపేట లో బీఆర్ఎస్ ఆరాచకాలకు అంతే లేదని.. డబ్బు సంచులతో రాజకీయాలు చేయాలని భావించడం ఆ పార్టీ కుటిల బుద్ధికి నిదర్శనమని మల్లు రవి విమర్శించారు. నిన్న గువ్వల బాలరాజు ఒక కారులో డబ్బుల సంచులతో పోతుంటే.. కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడం తప్పా అని ప్రశ్నించారు. ఎప్పుడు గొడవలు సృష్టిద్దామా అని కాచుకున్న గువ్వల బాలరాజు అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్లతో దాడులు చేశారని, తిరిగి కాంగ్రెస్ వాళ్లే దాడులు చేశారని అబద్ధపు ప్రచారాలు చేయడం సిగ్గుచేటని మల్లు రవి అన్నారు..
బాలరాజు తనకు దెబ్బలు తగిలాయని నాటకాలు ఆడుతున్నాడాని.. ఓటర్ల సానుభూతి కోసం ఆసుపత్రిలో చేరి కొత్త డ్రామాకు తెరతీసినట్టు మల్లు రవి పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు కూడా ఈ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించడం బీఆర్ఎస్ అవినీతికి, అహంకారానికి అద్దంపడుతుందని మల్లు రవి మండిపడ్డారు.