అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు ఆగం ఆగం మాటలు మాట్లాడుతున్నాడని ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ 100 కోట్లను తమ బంట్రోతులకు ఇచ్చి డబ్బు, మద్యంతో ములుగు నియోజకవర్గ ప్రజలను కొనడానికి పంపిచారని ఆరోపించారు.
ములుగు మండలంలోని కాన్నాయి గూడెం గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సీతక్క మాట్లాడుతూ.. ఎందుకు తనపై ప్రభుత్వానికి ఇంత కక్ష అని మండిపడ్డారు. తాను ప్రజా సేవ చేసినందుకా? లేక ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నందుకా? అని ప్రశ్నించారు. మంత్రిని అవుతానని చెప్పడం తన కళ అని, బడుగు బలహీనవర్గాలు మంత్రులు కావాద్దా? అని ప్రశ్నించారు.
ఇంకా దొరల చేతిలో బందీలుగా బతుకుదామా? అన్నారు. దొరల తెలంగాణ కావాలా ప్రజల వద్దకే పాలన అందించే కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు మన ఇళ్లలోకి వస్తే తిరగబడండి తరిమి కొట్టండి అని ప్రజలకు సీతక్క పిలుపునిచ్చారు. నేను ప్రజల మనిషిని.. ప్రజల కోసం పరితపించే వ్యక్తిని.. ప్రజల పక్షాన నిలబడి కోట్లాడే వ్యక్తిని అన్నారు.
తాను గెలిస్తే డబ్బులు గెలిచినట్లు.. నేను గెలిస్తే ములుగు ప్రజలు గెలిచినట్లు అని సీతక్క వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకులను నటనను నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ఉద్యమం సమయం 29, నవంబర్ 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభిస్తామన్న స్థలం వద్ద మంత్రి హరీశ్‌రావు ఒంటిపై పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మర్చినపోయిన విషయాన్ని సీతక్క ప్రస్తావించడం విశేషం.