కేసీఆర్(KCR)కు రెండుసార్లు అవకాశం ఇస్తే బంగారు తెలంగాణను.. బిక్షమెత్తుకునేలా చేశారని బీజేపీ సీనియర్ లీడర్, ఎంపీ లక్ష్మణ్(Mp Laxman)ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచుకున్న పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు అని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ప్రజల హితం కోరేవి కావన్నారు. కేసీఆర్‌కు మరోసారి అవకాశం ఇస్తే ఏమీ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని కేసీఆర్.. రేషన్ కార్డు గురించి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పది సంవత్సరాల్లో చేయని అభివృద్ధి 10 రోజుల్లో చేస్తానంటే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని అన్నారు. ఇది కేవలం ఎన్నికల వ్యూహమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
బీజేపీ బీసీలను ముఖ్యమంత్రి చేస్తానంటే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని లక్ష్మణ్ హెచ్చరించారు. మైనార్టీ ఓట్ల కోసం ఇరు పార్టీలు హిందువులను అపహేళన చేస్తున్నాయని ధ్వజమెత్తారు. మోదీ అంటే ఒక వసుదైక కుటుంబమని కొనియాడారు. 30 సంవత్సరాలుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరాటానికి మోదీ పరిష్కారం చూపారని తెలిపారు.
రేవంత్‌రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. తమలా మోసపోవద్దని కర్ణాటక రైతులు కోరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌లో 59మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఒక్కరూ పార్టీలో ఉండరన్నారు.
బీఆర్ఎస్‌కు ఎస్సీ వర్గీకరణపై మాట్లాడే అర్హత లేదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ వర్గీకరణలో శాశ్వత పరిష్కారం చూపుతామని హమీ ఇచ్చారు. బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే జరగదని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకురాలు విజయశాంతి పార్టీనీ వీడరని విశ్వాసం వ్యక్తం చేశారు.