సీఎం కేసీఆర్(Cm Kcr) ఇంద్రలోకాన్ని చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడని కాంగ్రెస్ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) విమర్శించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై కీలక వ్యాఖ్యలు చేశారు.
2014కు ముందు కేసీఆర్ ఆర్థిక పరిస్థితి ఏంటి?.. గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేసీఆర్ ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రజలను మభ్య పెడుతుంటాడని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
దొరలకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని అని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల పోరులో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను నమ్మవద్దని హితవు పలికారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ ష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు.
ఏంతో మంది కవులు, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థుల బలిదానం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. కానీ కేవలం ఒకే ఒక్క కుటుంబం తమ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటుందని ఆరోపించారు. కుటుంబ పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు.