కాంగ్రెస్ (Congress) పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో గరం గరం మాటలతో దూసుకుపోతున్నారు.. బీఆర్ఎస్ (BRS)పై ఏకధాటిగా విమర్శలు చేస్తూ.. కారు టైర్లను పంక్చర్ చేయడానికి పదునైన మాటలు వాడుతున్నారని అనుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్ (Revanth) ఫామ్ లో ఉండగా.. కాంగ్రెస్ పార్టీ మునుగోడు అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగంలోకి దిగారు.. టూర్ కి వెళ్ళినట్టు బీజేపీలోకి వెళ్లి వచ్చిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడే చార్జ్ అయిన రిమోట్ కారులా ప్రచారంలో దూసుకుపోతున్నారని అనుచరులు ఆనందపడుతున్నారు.
మునుగోడు మండలం కొరటికల్, గూడపూర్, కల్వలపల్లి, పులిపలుపుల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. చెయ్యి గుర్తు జిందా తిలిస్మాత్ లాంటిదని.. ఇది అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని తెలిపారు. అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే కొట్లాడలేనంతగా మునుగోడు (Munugodu) సమస్యల పరిష్కారం కోసం నేను పోరాడానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి 18 నెలల ముందు రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నా రాజీనామా దెబ్బకి కేసీఆర్, కేటీఆర్ (KTR) 119 మంది ఎమ్మెల్యేలను మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చానన్నారు. మునుగోడు నియోజకవర్గానికి మూడున్నర ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వని కేసీఆర్ నా రాజీనామాతో 500 కోట్ల అభివృద్ధికి నిధులు ఇచ్చాడని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ (BJP) ఒక్కటే అని అర్థం అయ్యిందన్న రాజగోపాల్ రెడ్డి.. మద్యం కుంభకోణంలో కవితను అరెస్టు చేయకపోవడానికి కారణం వారి మధ్య ఉన్న ఒప్పందం అని విమర్శించారు. 6 గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. మీ ఓటు పంచర్ కాబోయే కారుకేస్తారా.. అన్నం పెట్టే చేయికేస్తారా తేల్చుకోండని పేర్కొన్నారు.. ఈ సందర్భంగా మునుగోడులో కారు మునగడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు.