Telugu News » Congress : కాంగ్రెస్ గలాటా.. సూర్యాపేటలో హై టెన్షన్..!

Congress : కాంగ్రెస్ గలాటా.. సూర్యాపేటలో హై టెన్షన్..!

ఓవైపు చర్చలు సాగుతుండగా.. రమేష్ రెడ్డి భార్య లావణ్య మీడియాతో మాట్లాడుతూ.. సర్వే నివేదికలన్నీ తమకే అనుకూలంగా ఉన్నా కూడా.. దామోదర్ కు టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

by admin
Congress High Command Meets Patel Ramesh Reddy

– టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రెడ్డి
– రెబల్ అభ్యర్థిగా బరిలో!
– అధిష్టానం బుజ్జగింపులు
– సూర్యాపేటకు ఏఐసీసీ దూతలు
– గేటు దగ్గరే ఆపేసిన రమేష్ రెడ్డి వర్గీయులు
– తోపులాటతో టెన్షన్ టెన్షన్

సోనియాగాంధీ (Sonia Gandhi) తెలంగాణ ఇచ్చింది ఇందుకేనా? అనే నినాదంతో ప్రచారంలో కేసీఆర్ (KCR) సర్కార్ ను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ (Congress) పార్టీకి.. సొంత నేతల నుంచి చిక్కులు తప్పడం లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొందరు ఇతర పార్టీలకు జంప్ అవుతుండగా.. మరికొందరు సైలెంట్ గా ఉండిపోయారు. కానీ, కొందరు మాత్రం పార్టీని వదల్లేక.. సైలెంట్ గా ఉండలేక.. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగి నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో వాళ్ల చేత నామినేషన్ల ఉపసంహకరణకు ఏఐసీసీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే సూర్యాపేట (Suryapet) రెబల్ అభ్యర్థి రమేష్ రెడ్డి (Ramesh Reddy) ఇంటికి వెళ్లారు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మల్లు రవి.

Congress High Command Meets Patel Ramesh Reddy

రమేష్ రెడ్డి వర్గీయులు ఈ భేటీని అడ్డుకున్నారు. ముందు, వారిని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత రమేష్ రెడ్డి సూచన మేరకు శాంతించి ఇంట్లోకి వెళ్లనిచ్చారు. చర్చలు జరుగుతున్న క్రమంలో బయట ఉన్న కార్యకర్తలు ఓపిక నశించి రాళ్లతో దాడి చేసి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ పరిస్థితుల్లో నామినేషన్ ఉపసంహరించుకోవద్దని.. ఒకవేళ అదే జరిగితే సూర్యాపేటలో తిరిగే పరిస్థితి లేదని రమేష్ రెడ్డికి సూచించారు.

ఓవైపు చర్చలు సాగుతుండగా.. రమేష్ రెడ్డి భార్య లావణ్య మీడియాతో మాట్లాడుతూ.. సర్వే నివేదికలన్నీ తమకే అనుకూలంగా ఉన్నా కూడా.. దామోదర్ కు టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు అన్యాయం జరగడానికి కారణం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని, రూ.30 కోట్లు తీసుకుని టికెట్ ఇప్పించారని ఆరోపించారు. రమేష్ రెడ్డి అభిమానులు నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సూర్యాపేట టికెట్‌ కోసం రాంరెడ్డి దామోద‌ర్‌ రెడ్డి, ప‌టేల్ ర‌మేష్ రెడ్డి ఆశించారు. అయితే.. అధిష్టానం దామోద‌ర్‌ రెడ్డి వైపే మొగ్గు చూపింది. దీంతో రమేష్ రెడ్డి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు, అనుచ‌రులు క‌న్నీటిప‌ర్యంతం కావ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ క్రమంలో ఆయన రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

You may also like

Leave a Comment