ఉత్తరాఖండ్(Uttarakhand)లో వరుస ప్రమాదాలు(Accidents) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌ను తప్పించబోయి ఓ టాక్సీ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. దాల్కన్య సర్పంచ్ రాజు గ్రామస్థులతో కలిసి పనేరు శిబిరం అధౌడ నుంచి హల్ద్వానీ వైపు ఉదయం 8 గంటలకు టాక్సీలో బయల్దేరారు. ఓకలకండ బ్లాక్‌లోని దాల్ కన్య, చిదాఖాన్ సమీపంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఎదురుగా బైక్ రావడంతో వాహనం అదుపు తప్పి కాలువలోకి బోల్తా కొట్టింది.
జాతీయ రహదారిపై ట్యాక్సీ 500మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో 4 మందిని రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. నైనిటాల్ జిల్లా ఓఖల్ కండ బ్లాక్‌లోని చీరాఖాన్-రీతాసాహిబ్ మోటార్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
వాహనం పడిపోయిన శబ్దం విన్న గ్రామస్థులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. టాక్సీలో 11 మంది ప్రయాణించే అవకాశం ఉంది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి, నలుగురు పురుషులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.