తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ(T Congress) దూసుకుపోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు ప్రకటించి ప్రచారాన్ని హోరెత్తించింది. తాజాగా 62 ప్రధాన అంశాలతో కూడిన పూర్తి స్థాయి మేనిఫెస్టోను ఇవాళ రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది.
అందులో యువత, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ మేనిఫెస్టోను రెడీ చేసింది. ‘అభయహస్తం’ పేరుతో 42 పేజీల టీ కాంగ్రెస్ ఆరు మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గాంధీభవన్లో విడుదల చేశారు. అభయ హస్తంలో 37 ప్రధానాంశాలతోపాటు అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్ క్యాలెండర్లో మరో 13 అంశాలను చేర్చి మొత్తం 42 పేజీలతో టీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది.
వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించి.. వాటిని క్రోడీకరించి చివరకు 62 అంశాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు గౌరవ భృతి ఇతర అంశాలపై కాంగ్రెస్ హామీలు గుప్పించింది. అదేవిధంగా, ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5లక్షలు అందిస్తామని పేర్కొంది.
యువ వికాసం పథకంలో భాగంగా విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నెట్ స్కూల్ అందిస్తామని పేర్కొంది. వృద్ధులకు రూ.4వేల పింఛన్, రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ‘చేయూత’ కింద అందిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.