ప్రధాని మోడీ (PM Modi)పై కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. వ్యాపార వేత్త గౌతమ్ ఆదానీ (Goutham Adani) కోసం ప్రధాని మోడీ 24 గంటలు పని చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ కేవలం అదానీ కోసమే పని చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
అందువల్ల భారత్ మాతాకీ జై కి బదులు అదానీజీకి జై అని అనాలని ఎద్దేవా చేశారు. రాజస్థాన్లోని బుండిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ…. పేదలు, రైతులు, కూలీలను కలిపి ‘భారత్ మాత’అని, ఈ దేశంలో ఆయా వర్గాల భాగస్వామ్యానికి భరోసా లభించినప్పుడే భారత్ మాతకు జై అని ఆయన అన్నారు.
ప్రధాని మోడీ రెండు హిందుస్థాన్లను తయారు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. అందులో ఒకటి ఆదానీ కోసం, మరొకటి పేదల కోసం అని విమర్శించారు. ఏది ఏమైనా దేశంలో ప్రధాని మోడీ కుల గణన చేపట్టరని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కుల గణన చేపట్టగలదన్నారు.
గౌతమ్ అదానీ, ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. అదానీ కంపెనీలపై యూఎస్ కు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ చేసిన ఆరోపణలపై పార్లమెంటరీ సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలంటూ పార్లమెంట్ సాక్షిగా మోడీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ విమర్శల దాడిని మరింత పెంచుతూ వస్తున్నారు.