Telugu News » Manda Krishna Madiga : బీజేపీకే మన మద్దతు…. మందకృష్ణ మాదిగ లేఖ….!

Manda Krishna Madiga : బీజేపీకే మన మద్దతు…. మందకృష్ణ మాదిగ లేఖ….!

ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని మాదిగ సామాజిక వర్గాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) కోరారు.

by Ramu
mrps extends support to bjp in assembly elections

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి (BJP) మద్దతు పలుకుతున్నట్టు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS)ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని మాదిగ సామాజిక వర్గాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) కోరారు. ఈ మేరకు మాదిగ ఆర్గనైజేషన్‌లకు ఆయన లేఖలు రాశారు.

mrps extends support to bjp in assembly elections

మాదిగలను సీఎం కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని మందకృష్ణ అన్నారు. అటు కేబినెట్ లో కూడా ఎస్సీలకు అవకాశం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. అందులోనూ మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉందన్నారు. కానీ తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మన మద్దతు తెలపాలన్నారు.

ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను కాంగ్రెస్ మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అధికారంలో ఉన్న పదేండ్లలో గానీ, ప్రతిపక్షంలో ఉన్న ఈ పదేండ్లలో గానీ ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ అసలు మద్దతు తెలపలేదని ఆయన మండిపడ్డారు. మాదిగలకు అనుకూలంగా వచ్చిన పలు నివేదికలను కాంగ్రెస్ విస్మరించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన బీజేపీకి బీసీ సంఘాలు మద్దతు తెలపాలి కదా అని ఆయన అన్నారు. బీసీలకు రాజ్యాధికారం రావాలని బీసీ సంఘాలు నిన్నటి వరకు మాట్లాడాయన్నారు. ఆ లెక్కన చూస్తే బీసీలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కన్నా బీజేపీ డబుల్ టికెట్లు ఇచ్చిందన్నారు. బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా టికెట్ ఇచ్చింది బీజేపీనేనని తెలిపారు.

తెలంగాణలో మార్పు కోరుకుంటే బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మార్పు ఎలా వస్తుందని ఆయన ప్రశ్నిచారు. కేసీఆర్ ను ఇప్పటికే రెండు సార్లు సీఎంగా చూశామని, ఇప్పుడు మూడో సారి చూస్తామన్నారు. అంతేగానీ అది మార్పు ఎలా అవుతుందని నిలదీశారు. పోనీ కాంగ్రెస్ కు ఓటు వేస్తే మార్పు వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో మొదటి సీఎం, చివరి సీఎంలు కాంగ్రెస్ నాయకులేనని చెప్పారు.

ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ రేవంత్ రెడ్డి వస్తాడన్నారు. మళ్లీ కాంగ్రెస్ నేతలే వస్తే అది మార్పు ఎలా అవుతుందని అడిగారు. 50 శాతం జనాభా ఉండి ఇప్పటి వరకు సీఎం కాలేకపోయామని బీసీ సామాజిక వర్గానికి ఆవేదన ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ వ్యక్తి సీఎం కాకపోవడం అవమానకరం కాదా అని ఆయన అడిగారు.

ప్రధాని మోడీ మాట ఇచ్చారంటే దాన్ని నెరవేరుస్తాడన్నారు. ఇతర నేతలతో పోలిస్తే మాటకు కట్టుబడి ఉండే నాయకుడు మోడీ అని ఆయన తెలిపారు. అలాంటి నేత వచ్చి బీసీని సీఎం చేస్తానని చెప్పారన్నారు. అలాంటప్పుడు బీసీలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే మీరంతా రెడ్లను కోరుకున్నట్టు అవుతుందన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే వెలమ దొరలను కోరుకున్నట్టు అవుతుందన్నారు. అదేమీ కొత్త కాదన్నారు. బీసీని సీఎం చేసే బీజేపీకి మద్దతివ్వడం మార్పు కాదా అని ప్రశ్నించారు.

అలాంటి బీజేపీని వదిలి బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయడమంటే మేము సీఎం కాకున్నా పర్వాలేదు వెలిమలే పరిపాలించిన పర్వాలేదని ఒప్పుకున్నట్టేకదా అని అడిగారు. అందువల్ల బీసీ సోదరులు, సోదరీమణులు ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే డిసెంబర్ 4న బీసీ సీఎం అభ్యర్థి ప్రమాణం చేస్తాడన్నారు. ఇంతకు మించి బీసీ సంఘాల ప్రజలకు కావాల్సిందేంటని ఆయన ప్రశ్నించారు.

వర్గీకరణ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో ఇప్పుడే స్ఫష్టంగా చెప్పలేకపోయినా తాను బీజేపీకి మద్దతు ఇస్తున్నానన్నారు. అలాంటిది డిసెంబర్ 4న బీసీ ముఖ్యమంత్రి అవుతారని, అలాంటప్పుడు మీరు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు. బీసీలకు ఇప్పుడు గొప్ప అవకాశం వచ్చిందన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీజేపీకి ఓటు వేయకుపోతే బీసీ రాజ్యాధికార నినాదాన్ని మీరే వదులుకున్నట్టు అవుతుందన్నారు. దొరలకు, పటేళ్లకు ఊడిగం చేసినట్టు అవుతుందన్నారు.

బీసీ నినాదానికి ఆర్ కృష్ణయ్య కేంద్ర బిందువన్నారు. పార్టీలకు అతీతంగా ఉన్నంత వరకు ఆయన మాట వేదంగా ఉందన్నారు. ఒక తప్పటడుగు వల్ల కృష్ణయ్య కొంత వెనుకబడి పోయారన్నారు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చిందన్నారు. ఏపీ సీఎంను నమ్ముకున్నంత వరకు, ఏపీ సర్కార్ ఇచ్చిన రాజ్యసభ సీటుకు కట్టుబడి ఉన్నంత వరకు మీరు పుట్టిన తెలంగాణ గడ్డపై రాజ్యాధికారం కోరుకునే హక్కు కోల్పోతారన్నారు. మీరు పుట్టిన గడ్డ మీద బీసీ వ్యక్తి సీఎం కావాలంటే ఇక్కడ బీజేపీకి, బీసీ సీఎం నినాదానికి అనుకూలంగా ఇక్కడ ప్రచారానికి రావాలని కోరారు.

You may also like

Leave a Comment