కార్తీక నవమి సందర్భంగా రామజన్మభూమి అయోధ్య నగరం దీప కాంతులతో వెలిగిపోతుంది. కార్తీక పౌర్ణమి రోజులను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అయోధ్య నగర ప్రదక్షిణకు అధిక సంఖ్యలో హాజరైన భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో రామ నామస్మరణ చేసుకుంటూ 45 కిలోమీటర్లు నడుస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు.. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.
ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లో శ్రీరామ జన్మభూమి అయోధ్య (Ayodhya) నగర ప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. పూజారులు మంగళవారం వేకువజామున 2.09 గంటలకు శుభముహుర్తం ఉందని వెల్లడించినప్పటికి.. అంతకు ముందే భక్తులు ప్రదక్షిణ ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు.. రామ నామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తున్నారు..
కార్తీక నవమి (Kartika Navami)రోజున అనేక మంది ప్రజలు.. పూజలు, ఉపవాసాలు, దానధర్మాలు చేస్తుంటారు. నవమి రోజు అలా చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఏటా అయోధ్యకు ప్రదక్షిణలు చేయడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది 50 లక్షల మందికి పైగా భక్తులు ప్రదక్షిణలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి, ప్రజలకు తాగునీరు అందించే బాధ్యతను అప్పగించారు. ప్రదక్షిణ మార్గంలో పలు చోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు స్థానిక ప్రజలు.. భక్తులకు ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.