కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లల్లో వరుస ఐటీ సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ ఉదయం చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి(Vivek venkata swami) ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన కొద్ది గంటల్లోనే మరో కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు(ED, IT Raids) జరిగాయి.
తాజాగా, కాంగ్రెస్ బెల్లంపల్లి అభ్యర్థి గడ్డం వినోద్(Gaddam Vinod) ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో సోదరులిద్దరిపై సోదాలు నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివేక్ నివాసంలో దాదాపు నాలుగున్నర గంటల పాటు సోదాలు జరిగాయి. ఈ నెల 13న ఫ్రీజ్ చేసిన రూ.8కోట్ల నగదుపై ఐటీ ఆరా తీసింది. అయితే వివేక్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈడీ అధికారులు వెళ్లిపోయారు.
కాగజ్‌నగర్‌లో పలువురు వ్యాపారవేత్తల ఇళ్లల్లో ఐటీ తనిఖీలు జరుపుతోంది. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్12 లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కొమురంభీం జిల్లాలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు, వివేక్ ఇంట్లో ఎలాంటి డాక్యుమెంట్లు, నగదును కూడా అధికారులు సీజ్ చేయనట్లు తెలుస్తోంది. అటు మంచిర్యాలలో ఈడీ, ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా షాదన్ కాలేజ్‌లో పనిచేస్తున్న ఇక్బాల్ అహ్మద్ నివాసంలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.