ఇజ్రాయెల్ (Israel)-హమాస్ (Hamas) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. తమ వద్ద బంధీగా (Hostages) ఉన్న 50 మంది మహిళలు, పిల్లలను విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 150 మంది పాలస్తీనియన్ మహిళలు, పిల్లలను విడుదల చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చాయి.
హమాస్‌తో ఒప్పందం విషయంపై ఇజ్రాయెల్ కెబినెట్ నిన్న రాత్రి సమావేశం అయింది. సుదీర్ఘ ఆలోచనల తర్వాత ఈ ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది అత్యంత కష్టమైన నిర్ణయమని, కానీ ఈ సమయంలో సరైన నిర్ణయమని తాము భావిస్తున్నట్టు కేబినెట్ మంత్రి ఒకరు తెలిపారు. రోజుకు కొంత మంది చొప్పున 50 మంది బందీలను విడుదల చేయనున్నట్టు హమాస్ వర్గాలు వెల్లడించాయి.
మొదట బ్యాచ్ బందీలను గురువారం విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఇజ్రాయెల్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కాల్పుల విరమణ నేపథ్యంలో వచ్చే వారం ఇజ్రాయెల్‌లో యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటోనీ బ్లింకన్ పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్, పాలస్తీనాకు చెందిన ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరుపుతారని సమాచారం.
ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తి స్థాయిలో యుద్దం ముగింపునకు దారి చూపుతుందని తాము ఆశిస్తున్నట్టు అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక బంధీలను విడుదల చేసే విషయంలో ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య ఒప్పందం కుదిరిందని నెతన్యాహు వెల్లడించారు. నాలుగు రోజులు పాటు కాల్పుల విరమణకు ఒప్పుకున్నప్పటికీ, తర్వాత హమాస్ పై తమ యుద్దం కొనసాగుతుందని నెతన్యాహు వెల్లడించారు.