‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అన్నారు పెద్దలు. తెలుగు, రాష్ట్రాల(AP, Telangana)తో పాటు దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్(Wedding Season) ప్రారంభమైంది. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే వ్యాపారులకు పండగనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో బాగా స్థిరపడిన వారు పెళ్లికి అయ్యే ఖర్చు విషయంలో ‘తగ్గేదే లే..’ అంటున్నారు. మరికొందరు వారి స్థోమతను బట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి ముహూర్తాలు రానేవచ్చాయి.
ఈనెల 23వ తేదీ నుంచి పెళ్లిళ్లు మరింత ఊపందుకోనున్నాయి. రేపటి(గురువారం) నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ పెళ్లిళ్ల సీజన్‌లో 38 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరుగనున్నాయని కన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్(కాయిట్) వెల్లడించింది. 30 నగరాల్లో అంచనా వేసి ఏకంగా రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
నవంబర్ 23, 24, 27, 28, 29 తేదీలతో పాటు, డిసెంబర్ 3, 4, 7, 8, 9, 15, 1 తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయని కాయిట్ పేర్కొంది. ఈ సీజన్‌లో ఢిల్లీలోనే ఏకంగా 4 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయని, రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం ఇక్కడి జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఈనెల 19వ తేదీన రికార్డు సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయని చెబుతున్నారు.
పెళ్లిళ్లకు అవసరమైన వస్తువులు, వివిధ సేవల కోసం వినియోగదార్లు గత ఏడాది చేసిన ఖర్చుతో పోలిస్తే దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా అదనంగా ఖర్చు చేయబోతున్నారని కాయిట్ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. అయితే, ఈ ఏడాది పెళ్లిళ్ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. గతేడాది 32 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరగ్గా.. ఈ సమయంలో దాదాపు రూ.3.75 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు తెలిపారు.