– నిర్మల వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ప్లస్ అయ్యాయా?
– బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడిందా?
– కాంగ్రెస్ నెక్స్ట్ ప్లానేంటి?
– మోటార్లకు మీటర్లు.. ఏది నిజం?
బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కలిసే డ్రామాలు ఆడుతున్నాయనేది మొదట్నుంచి కాంగ్రెస్ (Congress) చెబుతున్న మాట. దీన్ని ఇరు పార్టీల నేతలు ఖండిస్తూ వస్తున్నారు. పైగా, ఒకరినొకరు తిట్టుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అసలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని కాషాయ నేతలు.. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని గులాబీ నేతలు తిట్టిపోసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ వార్ పీక్స్ కు చేరింది. ఇలాంటి సమయంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) చేసిన వ్యాఖ్యలు బీజేపీ, బీఆర్ఎస్ బంధాన్ని బయటపెట్టాయని అంటున్నారు హస్తం నాయకులు.
కేసీఆర్ (KCR) జాతీయ రాజకీయాల అనౌన్స్ మెంట్ నుంచి కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రధాని మోడీ (PM Modi) పై డైరెక్ట్ గా ఎటాక్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మోటార్లకు మీటర్ల అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని.. వారి మెడకు ఉరి తాళ్లు వేయాలని బీజేపీ సర్కార్ చాలా కాలంగా వేధిస్తోందని ఆరోపించారు. అప్పులు ఇవ్వడం లేదని.. 25 వేల కోట్లు నష్టపోయినా సరే మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని తేల్చి చెప్పానని చెబుతూ వస్తున్నారు కేసీఆర్. బీజేపీని లక్ష్యంగా చేసుకోవడానికి సీఎంకు ఈ మీటర్ల అంశం ఓ అస్త్రంగా మారింది.
తాజాగా హైదరాబాద్ లో ప్రచారం చేసేందుకు వచ్చిన నిర్మలా సీతారామన్ మోటార్లకు మీటర్ల అంశంపై మాట్లాడారు. మీటర్లు పెట్టనందుకే తెలంగాణకు అదనపు రుణానికి అనుమతి ఇవ్వలేదని అన్నారు. అదనపు రుణం ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పుకొచ్చారు. వాటిని పాటించకుండా అప్పు ఇవ్వడం ఎలా వీలవుతుందన్నారు. మిగతా రాష్ట్రాలన్నీ అలా కాదని.. చెప్పిన వెంటనే మోటర్లు బిగించాయని అందుకే వాటికి అదనపు రుణాలు ఇచ్చామని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుండగా.. బీజేపీకి మైనస్ గా మారాయనే చర్చ జరుగుతోంది.
కేంద్రం కచ్చితంగా మీటర్లు పెట్టాలని చెప్పలేదు.. విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలని కోరింది.. మీటర్లు పెట్టాలా లేదా అనేది ఆప్షన్ గానే ఉంచిందని ఇన్నాళ్లూ బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తూ వచ్చారు. ఇప్పుడు.. నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో వారంతా తలలు పట్టుకుంటున్నారు. తప్పంతా కేంద్రానిదే అన్నట్టుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ కాషాయ వర్గాల్లో చర్చ జరుగుతోందని చెబుతున్నారు రాజకీయ పండితులు. మరోవైపు, బీఆర్ఎస్ వర్గాలు ఫుల్ ఖుషీగా ఉన్నాయి. బీజేపీపై ఎటాక్ ప్రారంభించాయి. తెలంగాణలో బీఆర్ఎస్ రాకపోతే మోటార్లకు మీటర్లు వస్తాయని.. ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చినా తాము మోటార్లకు మీటర్లు పెట్టబోమని హామీ ఇస్తున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా మీటర్లు పెట్టారని.. ఆ రెండు పార్టీలను నమ్మొద్దని ప్రచారం చేస్తున్నాయి. ఇక, హస్తం పార్టీ అయితే.. బీజేపీ, బీఆర్ఎస్ సహకరించుకుంటున్నాయనడానికి ఇదే నిదర్శనమని చెబుతోంది. మొత్తంగా ఈ అంశం రాజకీయ యుద్ధానికి దారి తీసింది.