అన్నదమ్ముల బంధం అంటే నేటి కాలంలో ఆస్తులు పంచుకోవడం.. అపార్థాలు పెంచుకోవడం వరకే కొనసాగుతున్నాయి. కానీ అక్కడక్కడ మాత్రం అన్నతమ్ముడు అంటే ఇలా ఉండాలనే ఘటనలు జరుగుతున్నాయి.. చిన్నప్పుడు తమ్ముడికి చిన్న గాయం అయితే తల్లడిల్లే అన్న.. పెద్దవాడిగా మారాక పూర్తిగా మారిపోవడం ఎన్నో సందర్భాలలో కనిపిస్తుంది.
కానీ ఇక్కడ ఒక అన్న మాత్రం తన తమ్ముడి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోక.. తాను ప్రాణ త్యాగం చేసి తన తమ్ముడిని బ్రతికించుకున్నాడు.. నెల్లూరు (Nellore) జిల్లాలో జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తుంది. నెల్లూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు రూరల్ ఊప్పుటూరు (Upputur)కి చెందిన విజయ్ కుమార్ (Vijay Kumar) ఇంటి ఆవరణలో ఇనుప తీగ పై ఆరేసిన టవల్ను తీస్తున్నాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ (Electric shock)కు గురయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన అతని అన్న, సోదరుడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. తమ్ముడిని రక్షించేందుకు ప్రయత్నించి కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించాడు. కాగా బాధితులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అన్న మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
మరోవైపు తమ్ముడు విజయ్ కుమార్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అయితే వైద్యులు విజయ్ కుమార్ కు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తమ్ముడిని కాపాడబోయి అన్న ప్రాణాలు వదలడంతో బాధితుల కుటుంబంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి. చూశారా కరెంట్ అంటే ఎంత ప్రమాదామో.. ఈ విషయం తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉండే వారిని ఎవరు కాపాడలేరని కొందరు అనుకుంటున్నారు.