కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల (Sabarimala Temple) అయ్యప్పస్వామి ఆలయాన్ని ఈనెల 17న తెరిచిన విషయం తెలిసిందే. రెండు నెలల పాటు భక్తులకు అయ్యప్ప దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. భారీ వర్షాల(Heavy Rains) నేపథ్యంలో రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేశారు.
ఇప్పటికే ఆలయ ప్రారంభంతో భక్తుల తాకిడి ప్రారంభమైంది. శబరిమల అంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి తరలివస్తున్నారు. మరోవైపు.. ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో కేరళలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
పైగా శబరిమల ఉన్న కేరళలోని పతనంతిట్ట జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు తీర ప్రాంతాలు, ఆనుకుని ఉన్న నైరుతి మధ్య పశ్చిమ బెంగాల్లో అల్పపీడన ద్రోణి కారణంగా రుతుపవనాల వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పతనంతిట్ట జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది.
కేరళలోని తిరువనంతపురం, పఠనిట్ట, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా కాసర్గోడ్, కన్నూరుతో పాటు మిగిలిన జిల్లాలకు కూడా ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు భక్తుల రద్దీని నియంత్రించేందుకు అయ్యప్ప దర్శనాన్ని 16గంటలు పెంచారు.