అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మరణించిన అమరవీరుల గురించి ప్రస్తావించే వారే కరువైయ్యారని అంతా అనుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఒక్కరి వల్ల సాధ్యం కాలేదన్న విషయం లోకం అందరికీ తెలిసిందే అని అంటున్నారు.. అధికారమే ధ్యేయంగా సాగుతున్న పార్టీలు.. రాష్ట్ర సాధనలో మరణించిన వారి కుటుంబాలను విస్మరిస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు.
మరోవైపు కేసీఆర్ (KCR) వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని బీఆర్ఎస్ (BRS) నేతలు జోరుగా ప్రచారం చేయడం తెలిసిందే.. అయితే ఇదే విషయాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ (Mahmood Ali) మరోసారి గుర్తు చేశారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా మానకొండుర్ మండల కేంద్రంలో ముస్లిం మైనారిటీ మత పెద్దలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మహ్మద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇతర పార్టీ నాయకుల తప్పుడు మాటలు, హామీలు నమ్మితే.. తెలంగాణ అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉందని మహ్మద్ అలీ వెల్లడించారు. తెలంగాణ వస్తే అనేక ఇబ్బందులు వస్తాయని అనేక సార్లు కేసీఆర్ తో ఢిల్లీ పెద్దలు అన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ 11 రోజుల పాటు రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారని.. తన ప్రాణాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని డాక్టర్ల సూచించిన కేసీఆర్ పట్టు విడవలేదని మహ్మద్ అలీ వెల్లడించారు..
కాంగ్రెస్ 50 ఎండ్ల పాలనలో ముస్లిం మైనారిటీలకు చేసింది ఏం లేదు .. ఓట్లు వేయించుకొని మోసం చేయడం తప్ప? అని మహ్మద్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న ముస్లిం మైనారిటీలు అందరూ సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా మహ్మద్ అలీ కోరారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 934 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్న మహ్మద్ అలీ.. కేసీఆర్ ప్రభుత్వం 2014 నుండి 2023 వరకు 1100 కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. ఈ విషయాలు గమనించి బీఆర్ఎస్ ను గెలిపించాలని మహ్మద్ అలీ కోరారు..