వాతావారంలో నెలకొంటున్న మార్పుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కూరుస్తుండగా.. ఈ వర్షాలు ఇంకా ఉన్నాయని వెల్లడిస్తున్నారు చెన్నై (Chennai) వాతావరణ పరిశోధన కేంద్రం (Atmospheric Research Centre) అధికారులు.. ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పవాయు గుండం కారణంగా రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలుపుతున్నారు.
అండమాన్ దీవులకు సమీపంలో ఈనెల 26న కేంద్రీకృతం కానున్న అల్పవాయుపీడనం 27వ తేది మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ప్రకటిస్తున్న వాతావరణ శాఖ అధికారులు.. ఈ ప్రభావం వల్ల రాష్ట్రం తో పాటు సముద్రతీర ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు..
మరోవైపు వాతావరణ పరిశోధన కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ బాలచంద్రన్ మాట్లాడుతూ… ఈశాన్య రుతువపనాల ప్రభావం కారణంగా అక్టోబరు 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 28సెం.మీల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. సగటున 32 సెం.మీల. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా తక్కువగానే వర్షాలు కురిశాయని బాలచంద్రన్ తెలిపారు. రాబోవు మూడు రోజుల్లో ఈరోడ్ తిరుప్పూరు (Tiruppur)..దిండుగల్, తిరునల్వేలి, కన్నియాకుమారి, విరుదునగర్, తూత్తుకుడి, మదురై జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు.
కాగా చెన్నై ప్రాంతంలో తేలిక పాటి వర్షాలే కురుస్తాయని వెల్లడించిన బాలచంద్రన్.. ఈనెల 26వ తేదినుంచి జాలర్లు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. రాబోవు రోజుల్లో రుతుపవనాలు మరింత చురుగ్గా ఉండి రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. కాగా పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం, నీలగిరి జిల్లా ఊటీ ప్రాంతాలు వర్షాలకు బురదమయంగా మారాయి..
గత మూడు రోజులుగా కుండపోత వర్షాల వల్ల సింగరాయపాళయం, కన్నార్‌పాళయం, కరుప్పరాయన్ నగర్, పొల్లాత్తి, చెన్నమాపాళయం, పట్టకారనూరు, ఏళుఎరుమైపల్లమ్ ప్రాంతాల్లోని చెక్‌డ్యాంలలో వర్షపు నీరు వరదలా పొంగి ప్రవహిస్తున్నాయి. ఈరోడ్ జిల్లా గోపిశెట్టి పాళయంలోనూ భారీగా వర్షం కురిసింది. అరసూరు, తట్టాన్‌పుత్తూరు తదితర ప్రాంతాల్లో చెదురుముదురుగా వర్షాలు కురిశాయి.