Telugu News » Rahul Gandhi : అవినీతిపరుడైన కేసీఆర్ జోలికి మోడీ వెళ్లరు…!

Rahul Gandhi : అవినీతిపరుడైన కేసీఆర్ జోలికి మోడీ వెళ్లరు…!

పేదల భూములను లాక్కునేందుకే దొరల సర్కార్‌ ధరణి పోర్టల్ తీసుకు వచ్చిందంటూ ఆరోపణలు గుప్పించారు.

by Ramu

బీఆర్ఎస్ (BRS) సర్కార్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిప్పులు చెరిగారు. పేదల భూములను లాక్కునేందుకే దొరల సర్కార్‌ ధరణి పోర్టల్ తీసుకు వచ్చిందంటూ ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ యువత కలలు, ఆశయాలను బీఆర్​ఎస్​ సర్కార్ పూర్తిగా నాశనం చేసిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజల ప్రభుత్వం ఏర్పాటవుతుందని తాము భావించామన్నారు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని తాము ఊహించలేదన్నారు. ఆదిలాబాద్​లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో రాహుల్ గాంధీ​ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని అన్నారు.

ఈ దొరల తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు ప్రజా ధనాన్ని మొత్తం లూటీ చేశారని మండిపడ్డారు. భూములు, ఇసుక, మద్యంలో జరిగిన దోపిడీ సొమ్మంతా కేసీఆర్‌ కుటుంబంలోకి చేరిందని ఆరోపణలు గుప్పించారు. పేదల భూములు లాక్కునేందుకే దొరల సర్కార్‌ ధరణి పోర్టల్ తీసుకు వచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎంత మందికి వచ్చాయని ప్రశ్నించారు. దళిత బంధు పథకంలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు రూ.3 లక్షలు కమీషన్లు తీసుకున్నారని రాహుల్ గాంధీ​ ఆరోపించారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌లో రూ.5200 కోట్లు దండుకున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని తాము ఊహించలేదన్నారు.

కేసీఆర్​ అవినీతిపై ప్రధాని మోడీ విచారణ జరిపించగలరా అని సవాల్ విసిరారు. తన లోక్‌సభ సభ్యత్వాన్ని ప్రధాని మోడీ రద్దు చేశారని అన్నారు. ఎంపీల క్వార్టర్స్‌ నుంచి తనను ఖాళీ చేయించారని గుర్తు చేశారు. కానీ అవినీతిపరుడైన సీఎం కేసీఆర్‌ జోలికి మాత్రం ప్రధాని మోడీ వెళ్లరని మండిపడ్డారు. కేసీఆర్‌ను సీఎం పదవి నుంచి మోడీ దింపగలరా? అని సవాల్​ విసిరారు.

తెలంగాణలో ఈ 3 నెలల్లోనే బీజేపీ గాలి పూర్తిగా పోయిందని ఎద్దేవా చేశారు. పార్టీ గాలి ఒక్కసారిగా పోవడంతో మోడీ సైతం అయోమయంలో పడ్డారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే కాంగ్రెస్‌ 6 గ్యారంటీల కార్డును తీసుకు వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చేది గ్యారెంటీ కార్డు మాత్రమే కాదని, వాటిని అమలు చేయకపోతే ప్రశ్నించే హక్కును కూడా ఇస్తోందన్నారు.

బీజేపీ, బీఆర్​ఎస్​, ఎంఐఎం పార్టీల మధ్య ఒప్పందం ఉందన్నారు. మోడీకి సీఎం కేసీఆర్‌, అసదుద్దీన్ ఓవైసీలు మంచి మిత్రులని వెల్లడించారు. మోడీకి ఢిల్లీలో కేసీఆర్‌, అసదుద్దీన్‌ అన్ని రకాల సాయం చేస్తారన్నారు. ఇటు తెలంగాణలో కేసీఆర్‌, అసదుద్దీన్‌కు ప్రధాని మోదీ సహాయం చేస్తాడని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.

You may also like

Leave a Comment