– ప్రచారంలో జోరు పెంచిన విపక్ష పార్టీలు
– సీఎం రెండు చోట్ల పోటీపై విమర్శల దాడి
– ప్రధాని మోడీ సైతం సెటైర్లు
– కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడిస్తానంటున్న రేవంత్
– బీజేపీ గెలవకుండా కేసీఆర్, రేవంత్ కుట్ర చేస్తున్నారంటున్న కిషన్ రెడ్డి
తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తుండడం ప్రతిపక్షాలకు ఓ అస్త్రంగా మారింది. ఓటమి భయంతోనే ఆయన గజ్వేల్ (Gajwel) తో పాటు కామారెడ్డి (Kamareddy) ని ఎంచుకున్నారని విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ (PM Modi) సైతం దీన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ రెండు స్థానాల నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇతర నేతలు సైతం ఇదే ప్రశ్న వేస్తున్నారు.
తాజాగా ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందిస్తూ.. పేదల రక్తం రుచి మరిగిన కేసీఆర్ ను వేటాడేందుకే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తెలంగాణ ద్రోహిని ఈ ఎన్నికల్లో బొంద పెట్టాలని కామారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని.. ఇన్నేళ్లలో గల్ఫ్ కార్మికుల గోసను ఏనాడూ కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఆయన కామారెడ్డికి వచ్చింది ప్రజల కోసం కాదని, ఇక్కడున్న భూములను కాజేసేందుకేనని ఆరోపించారు.
కేసీఆర్ ను ఓడించేందుకే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్టు రేవంత్ చెబుతుంటే.. ముమ్మాటికీ సీఎంను గెలిపించేందుకే రేవంత్ బరిలో నిలిచారని అంటున్నారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy). తమ అభ్యర్థి వెంకట రమణారెడ్డి గెలుపు అవకాశాలను దెబ్బ తీయాలనే కుట్రతో రేవంత్ కామారెడ్డికి వచ్చారని విమర్శించారు. అక్కడి ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని, బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో కేసీఆర్, రేవంత్ పై గెలవబోతున్నారని అన్నారు. అవినీతి, కుటుంబ పార్టీలు తెర వెనుక పన్నుతున్న కుట్రలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. పదేళ్ళకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసిందో, అలాగే.. బీఆర్ఎస్ ఏం చేసిందో చర్చ జరపకుండా.. డబ్బులు, మద్యం పంచడం, మజ్లిస్ పార్టీతో కలిసి బుజ్జగింపు రాజకీయలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఇక, తూప్రాన్ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కేసీఆర్ రెండు స్థానాల నుంచి ఎందుకు పోటీచేస్తున్నారని ప్రశ్నించారు. భూ నిర్వాసితులను రోడ్డునపడేసిన కేసీఆర్ ను ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. ప్రజలను కలవని సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వారసత్వ రాజకీయాలతో వ్యవస్థ నాశనమైందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొత్తంగా కేసీఆర్ రెండు రెండో చోట్ల పోటీ.. ఎన్నికల ప్రచారంలో రీసౌండ్ ఇస్తోంది.