తెలంగాణ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మంగళవారం ప్రచార పర్వానికి తెరపడుతుండగా.. 30న పోలింగ్ జరగనుంది. అయితే.. చివరి రోజు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పలువురితో చిట్ చాట్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో డ్రైవర్స్, డెలివరీ బాయ్స్, శానిటరీ వర్కర్లు, హెల్త్ వర్కర్లతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తాము పడుతున్న బాధలు, సమస్యలను రాహుల్ కు కార్మికులు వివరించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టు ఉద్యోగులను అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. తమకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని.. కాంట్రాక్టర్లు 11 గంటలు పనిచేయిస్తున్నారని వాపోయారు. సదుపాయాలు అడిగితే ఉద్యోగం మానేయమంటున్నారని ఆవేదన చెందారు.
డెలివరీ బాయ్స్ తమ కష్టాలను రాహుల్ కు చెప్పారు. రోజుకు ఎంత డబ్బు వస్తుందని ఆయన ఆరా తీయగా.. తమకు టూ వీలర్స్ ఇప్పించాలని, పెట్రోల్ రేట్ తగ్గించాలని కోరారు. ఇతర వర్కర్లు కూడా తమ సమస్యలను రాహుల్ ముందు ఏకరుపెట్టారు. గంటల కొద్దీ పని చేసినా తగినంత వేతనం రావడం లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కాంట్రాక్ట్ వర్కర్లు వాపోయారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ గెలవగానే.. కార్మికులతో సీఎం సమావేశం అవుతారన్నారు. అందరి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతానని వారికి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నడుచుకోలేదని.. కేవలం తన కుటుంబం కోసమే కేసీఆర్ పని చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు రాహుల్ గాంధీ.