ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీ నేతలంతా క్షణం తీరిక లేకుండా ఉన్నారు.. ఆఖరి నిమిషంలో చేసే ప్రచారంలో వచ్చే కిక్కే వేరబ్బా అంటూ దూకుడుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ (congress)..బీజేపీ (BJP)పై విరుచుకుపడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మరోసారి గళమెత్తి గర్జించారు..
నిజామాబాద్ (Nizamabad)లో నిర్వహించిన ప్రచారా సభలో పాల్గొన్న కవిత రాష్ట్రంలో నిరుద్యోగ కాంగ్రెస్ నేతల సమావేశాలు మాత్రమే జరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల మొసలి కన్నీరును నమ్మితే.. ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని కవిత ఆరోపించారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్.. బీజేపీలు..అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఐదేళ్లలో కేవలం 21 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినట్టు కవిత వెల్లడించారు. పదేళ్ల పాలనలో తెలంగాణ (Telangana) ప్రభుత్వం 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు వివరించారు.. ఇప్పటికే 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపిన కవిత.. ప్రైవేటు రంగంలో 30 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంలో కాంగ్రెస్ ఉందని ఆరోపించిన కవిత.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతా కూడా కొత్త డ్రామాకు తెరతీశారని.. బాండ్ పేపర్లు రాసిస్తామని చెప్పడం విడ్డూరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుమారు 50 ఏళ్ల రాజకీయ జీవితం గల సీనియర్ నాయకులు జగిత్యాల జీవన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, భట్టి విక్రమార్క వంటి వారు ఈరోజు బాండ్ పేపర్ల ప్రస్తావన తేవడం చూస్తుంటే.. కాంగ్రెస్‌పై ప్రజలు ఎంత విశ్వాసం కోల్పోయారో చెప్పడానికి ఇదే నిదర్శనమని కవిత దెప్పిపొడిచారు..