తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(TS Elections) రేపే(గురువారం) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఇతర సామగ్రిని చేర్చారు. సిబ్బంది కేటాయించారు. పోలింగ్(Polling) నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది.
పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసే విధానంపైనా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలని పోలీసు అధికారులు గ్రామాల్లో కవాతులు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) ఓటు వేసే విధానం, తీసుకోవాలని జాగ్రత్తలు తెలిపింది. అవేంటో చూద్దాం.. ముందుగా ఓటు వేయడానికి తప్పనిసరిగా గుర్తింపు కార్డు ఉండాలి. లేదంటే ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అనుమతించరు. ఎన్నికల సిబ్బంది ఇంటింటా పంపిణీ చేసే ఫొటోతో కూడిన ఓటరు చీటీ. కేవలం పోలింగ్ కేంద్రం, ఓటర్ల జాబితాలో క్రమ సంఖ్యతో కూడిన సమాచారం కోసం మాత్రమే.
ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు ఇలా.. ఎన్నికల సంఘం సూచించిన 12గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఓటరు వెంట తప్పనిసరిగా ఉండాలి. ప్రత్యేక వైకల్యం కలిగిన దివ్యాంగులకు కేంద్ర న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ జారీ చేసే యూనిక్ డిజిటల్ గుర్తింపు కార్డు ఉన్నా సరిపోతుంది. ఓటు వేయాలంటే పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు జాబితాలో పేరు తప్పనిసరిగా నమోదై ఉండాలి.
పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. పోలింగ్ బూత్ లోపలికి సెల్‌ఫోన్లు, కెమెరా, లాప్‌టాప్ వంటివి తీసుకెళ్లకూడదు. అదేవిధంగా సెల్ఫీలు తీసుకోవద్దు. ఒకవేళ పోలింగ్ కేంద్రం వద్ద సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేస్తే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు మీ ఓటును లెక్కించరు. ఇక పోలింగ్ కేంద్రం దగ్గర పార్టీల గుర్తులు, రంగులు కలిగిన దుస్తులు, టోపీల వంటివి అస్సలు ధరించకూడదు.