ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగిసి రోజు కూడా గడవక ముందే.. ప్రజలకు చమురు కంపెనీలు షాకిచ్చాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.21 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి.
పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (Commercial Gas Cylinders) ధరలను గమనిస్తే.. ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1796.50కు చేరింది. హైదరాబాద్ లో రూ.2024.5గా ఉంది. ముంబైలో రూ. 1,749.. చెన్నైలో రూ.1,968.50 పైసలుగా, కోల్‌కతాలో రూ. 1,908 గా ధరల్లో మార్పు కలిగింది. అయితే 14.2 కిలోల ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ ధరలో ఆయా కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు.
ఈమేరకు డొమెస్టిక్ సిలిండర్ ప్రస్తుతం రూ.918.50కి విక్రయిస్తున్నారు. ఇక నవంబర్ 16వ తేదీన వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరను కేంద్రం 57 రూపాయల మేర తగ్గించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఊరట కల్పించినప్పటికీ.. 15 రోజుల వ్యవధిలోనే మళ్లీ రేట్లను పెంచడం షాక్ కు గురిచేస్తుంది. తాజా పెంపు వల్ల హోటల్, చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వ్యాపారుల పై భారం పడుతుందని తెలుస్తుంది. కాగా అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై గ్యాస్ సిలిండర్ ధరలు ఆధారపడి ఉంటాయి. అందుకే కంపెనీలు ఈ ధరలను ప్రతి నెల ఒకటో తారీఖున మారుస్తుంటాయి.
మరోవైపు ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 5పైసలు, 4పైసల చొప్పున తగ్గాయి. దీంతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.87 గాను, లీటర్ డీజిల్ రూ.99.61 గా ఉంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 గాను, లీటర్ డీజిల్ ధర రూ. 97.82 గా ఉంది, నిన్న నమోదైన ధరలతో పోల్చితే ఇవాళ హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు..