కష్టం వచ్చినప్పుడల్లా తిరుమల తిరుపతి(Tirumala Tirupati) శ్రీ వేంకటేశ్వర స్వామి(Sri Venkateshwara Swami) ని ప్రార్థించానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Chandrababu) అన్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు వేద ఆశీర్వాచనం అందజేసి ప్రసాదం అందించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నేను కష్టంలో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజలందరు సంఘీభావం ప్రకటించారు.. 45 సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నా. ప్రపంచ పఠంలో భారత దేశం, భారత దేశంలో తెలుగు ప్రజలు అగ్రగామిగా ఉండాలన్నదే నా సంకల్పం. భవిష్యత్ కార్యచరణను త్వరలోనే ప్రకటిస్తా.’ అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
వేంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టిన తాను అంచెలంచెలుగా ఎదుగతూ వచ్చానని చంద్రబాబు చెప్పారు. 2003లో గరుడ సేవ రోజు 24 క్లైమర్ మైన్లతో దాడి జరిగినప్పుడూ వేంకటేశ్వర స్వామే ప్రాణ భిక్ష పెట్టారని చంద్రబాబు అన్నారు. మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా ఆయన దర్శనం తరువాతే మిగిలిన కార్యక్రమాలను ప్రారంభిస్తానని చెప్పారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ను సుప్రీంకోర్టు డిసెంబర్ 8కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. బెయిన్ కండీషన్లలో ఎలాంటి మార్పు చేయలేదు. బాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారించింది. ప్రాథమిక వాదనల అనంతరం కేసును వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇక, తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. క్యూ కాంప్లెక్స్ 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న (గురువారం అర్ధరాత్రి వరకు 58,278 మంది స్వామివారిని దర్శించుకోగా 17,220 మంది భక్తులు తలనీలాలు సమర్పించున్నారు. ఇక, స్వామివారికి కానుకల రూపంలో హుండీలో దాదాపు 3.53 కోట్ల రూపాయలు సమర్పించారు. నవంబర్ మాసంలో శ్రీవారి భక్తులు హుండీ ద్వారా రూ.108కోట్లు కానుకలుగా సమర్పించారు.