ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు సంవత్సరం క్రితం మృతిచెందిన తల్లి శవాన్ని(Mother’s dead body) ఇంట్లోనే పెట్టుకొని నివసిస్తున్నారు. ఈ ఘటన వారణాసి(Varanasi) జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని మదర్వా ప్రాంతానికి చెందిన ఉషా దేవి త్రిపాఠి(52) తన ఇద్దరు కూతుళ్లు పల్లవి, వైశ్విక్‌లతో కలిసి ఓ ఇంట్లో ఉండేది. పల్లవి పీజీ పూర్తిచేసింది. వైశ్విక్ పదో తరగతి చదువుతోంది. ఉషాదేవి భర్త రెండు సంవత్సరాల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దాంతో ఉషాదేవి ఓ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో ఉషాదేవి అనారోగ్యంతో 2022 డిసెంబరు 8న మృతి చెందింది. అయితే ఇద్దరు కూతుర్లు తల్లి మృతిచెందిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె అంత్యక్రియలు నిర్వహించలేదు. మృతదేహం వాసన బయటకు రాకుండా.. అగరవత్తులు కాల్చేవారు. కావలసిన వస్తువుల కోసం పల్లవి, వైశ్విక్ అప్పుడప్పుడు బయటకు వెళ్లి వచ్చేవారు.
కొన్ని రోజులుగా అక్కాచెల్లెళ్లు కనిపించకపోవడం, తలుపులు మూసి ఉండడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి.. బంధువులకు సమాచారం ఇచ్చారు. మీర్జాపుర్‌లో ఉంటున్న ధర్మేంద్రకుమార్ బుధవారం తన చెల్లి ఉషాను చూసేందుకు వచ్చాడు. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో ధర్మేంద్ర పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా ఓ గదిలో అస్థిపంజరం, మరో గదిలో అక్కాచెల్లెళ్లు ఉన్నారు.
అయితే ఈ ఘటనకు పోలీసులు దర్యాప్తులో భాగంగా మృతురాలి కూతుళ్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పల్లవి, వైశ్విక్‌లను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.