రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను (Assembly Elections) ఎంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు ప్రయత్నించినా అక్కడక్కడా కొందరు చేసే పనుల వల్ల వ్యవహారం చెడిపోతుంది. ఎలాంటి విద్వేషాలకు తావివ్వకుండా ఎన్నికలు సక్రమంగా, ప్రశాంతంగా నిర్వహించాలని ఈసీ తీవ్రంగా ప్రయత్నించింది. చివరికి ఓటింగ్ స్టేషన్ కి సెల్ ఫోన్ల అనుమతిని నిరాకరించింది. 144 సెక్షన్ కూడా విధించింది.
ఈ విషయాన్ని పదే పదే సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా చేసింది. అయినా నూటికి ఒక్కడైనా మాట వినని వాడు ఉంటాడు కదా.. ప్రస్తుతం ఇదే జరిగింది. ఓ తిక్కలొడి తిక్క యవ్వారం వార్తల్లో నిలిచింది. నల్గొండ (Nalgonda) జిల్లాలో జరిగిన ఘటన వివరాలు చూస్తే..
మిర్యాలగూడ నియోజకవర్గం (Miryalaguda Constituency) వేములపల్లి (Vemulapalli) మండలం ఆమనగల్ (Amanagal) గ్రామంలో బంటు శ్రీనివాస్ అనే వ్యక్తి ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్ళాడు.. అక్కడికి వెళ్లి ఓటు వేస్తూ ఫోటోస్ తీసుకున్నాడు. పోలింగ్ వీధుల్లో ఉన్న అధికారి ఈ విషయాన్ని గమనించి మొబైల్ ను పరిశీలించగా.. అందులో ఫోటోలు కనిపించాయి.. వెంటనే లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆ అధికారి.
ప్రిసైడింగ్ అధికారి వేమారెడ్డి ఫిర్యాదు మేరకు గురువారం వేములపల్లి పోలీస్ స్టేషన్ లో, బంటు శ్రీనివాస్ పై కేసు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన శ్రీనివాస్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియవలసి ఉంది.