– తెలంగాణలో జనసేనకు ఘోర పరాభవం
– రాష్ట్రంలో మొదటిసారి పోటీ
– బీజేపీతో కలిసి పొత్తు
– 8 చోట్ల నుంచి పోటీ
– పోటీ చేసిన అన్ని చోట్లా డిపాజిట్ గల్లంతు
జనసేన (Janasena) పార్టీ తెలంగాణ గడ్డపైనే పుట్టినా.. ఆంధ్రాపైనే మొదట్నుంచి ఫోకస్ చేసింది. 2019 ఎన్నికల్లో తెలంగాణను వదిలేసి ఏపీలోనే పోటీ చేసింది. ఈసారి కూడా పోటీ అక్కడి వరకే పరిమితం అవుతుందని అంతా అనుకోగా.. అనూహ్యంగా బీజేపీ (BJP) తో కలిసి బరిలోకి దిగింది. సీట్ల కేటాయింపులో భాగంగా 8 సీట్లను దక్కించుకుంది. ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, కూకట్ పల్లి, తాండూరు, కోదాడ, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అయితే.. అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్, సూర్యాపేట, కొత్తగూడెం సభల్లో కూకట్ పల్లిలో రోడ్ షో నిర్వహించారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఆ సమయంలో ఊహించినట్టే భారీగా జనం తరలివచ్చారు. అనూహ్య స్పందన లభించింది. ఇటు ప్రధాని మోడీతో కలిసి బహిరంగసభలో కూడా పాల్గొన్నారు. అయినా జనసేన ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కనీసం పోటీలో నిలవలేకపోయింది. పోటీ చేసిన 8 స్థానాల్లో ఓటమి చవిచూసింది.
ఖమ్మం, అశ్వారావుపేట వంటి చోట్ల అయితే.. జనసేనను అసలు ఓటర్లు పట్టించుకోలేదు. మొత్తం 8 చోట్ల కూకట్ పల్లిలో మాత్రం కాస్త ఓట్లు వచ్చాయి. అవికూడా గౌరవప్రదమైనవి కావు. జనసేన పోటీ చేసిన సీట్లలో ఆ పార్టీతోపాటు బీజేపీకి కూడా పెద్దగా బలం లేదు. జనసేన పార్టీకి క్యాడర్ లేకపోవడంతో.. పోటీ చేసిన చోట్ల గట్టిగా ప్రచారం చేయడానికి కూడా ఇబ్బందులు పడింది. అదీగాక, బీజేపీ వైపు నుంచి కూడా సరైన సహకారం అందలేదనే ప్రచారం ఉంది.
తెలంగాణలో జనసేనకు ఘోర అవమానం ఎదురవగా.. ఈ ప్రభావం ఏపీలో కనపడే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఇంకో 4 నెలల్లో ఆంధ్రాలో కూడా ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో తెలంగాణలో జనసేన చూసిన ఈ ఓటమి వైసీపీకి అస్త్రంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.