Telugu News » Kamareddy : కేసీఆర్, రేవంత్ ను ఓడించిన మొనగాడు..!

Kamareddy : కేసీఆర్, రేవంత్ ను ఓడించిన మొనగాడు..!

కామారెడ్డిలో బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రస్తుత సీఎం కేసీఆర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిగా చెప్పబడుతున్న రేవంత్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి బరిలో నిలవడం రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొల్పింది. కానీ రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పే తీర్పు ఇచ్చారు కామారెడ్డి ఓటర్లు

by Venu

– కామారెడ్డిలో బీజేపీ విజయఢంకా
– కేసీఆర్, రేవంత్ ఓటమి
– తీవ్ర ఉత్కంఠ నడుమ వెంకట రమణారెడ్డి గెలుపు
– హేమాహేమీలను ఓడించి రికార్డ్

కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎప్పటికీ గుర్తుంచుకునేలా నిలిచిపోయింది. దీనికి కారణం కేసీఆర్, రేవంత్ అక్కడి నుంచి బరిలో నిలవడమే. ప్రచారంలో కామారెడ్డి ఏంతో పుణ్యం చేసుకుంది కాబట్టి కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని.. ఈ నియోజక వర్గం ఎక్కడికో వెళ్లిపోతుందని కేటీఆర్ డోలు కొట్టారు. అయితే.. కామారెడ్డి ఎక్కడికీ పోలేదని.. ఇక్కడి నుంచి పోటీ చేసిన కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ కు పోయారనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

ఇక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది. కేసీఆర్‌ తో పాటు, రేవంత్ రెడ్డిని ఓడించి వెంకట రమణారెడ్డి వార్తల్లో నిలిచారు. ముందు నుంచి ఊహించినట్టే ఈ సీటులో హోరాహోరీ పోరు జరిగింది. క్షణక్షణానికి, రౌండ్ రౌండ్‌ కి ఆధిక్యం మూడు పార్టీల మధ్య మారుతూ వచ్చింది. చివరకు కామారెడ్డి ఓటర్ స్థానిక అభ్యర్థికే పట్టం కట్టారు.

ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించి బీజేపీ అభ్యర్థి చరిత్ర సృష్టించారు. 6 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా నాన్ లోకల్ లీడర్స్ కావడం వెంకట రమణారెడ్డికి కలిసి వచ్చింది. ఒకవేళ కేసీఆర్, రేవంత్ ఎవరు గెలిచినా సొంత నియోజకవర్గాలకు వెళ్తారని ప్రజలు భావించినట్టు సమాచారం.

ఈ క్రమంలో కామారెడ్డి ప్రజలు బీజేపీ అభ్యర్థి వైపే మొగ్గు చూపారు. దీనికి తోడు స్థానికంగా ఉన్న పరిస్థితులు కూడా బీజేపీకి కలిసివచ్చాయి. మొత్తానికి, బీజేపీలో గెలుస్తారని భావించిన నేతలు ఓడిపోగా అంచనాలను మారుస్తూ కొందరు గెలవడం అంతుచిక్కని ఓటరు నాడికి నిదర్శనం.

You may also like

Leave a Comment