తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) విజయంతో రాజకీయ సమీకరణాలు మారుతాయని అంతా భావిస్తున్నారు. అధికార పార్టీలో ఉంటేనే అనుకున్నది జరుగుతుందనే భావన నేతల్లో ఉన్న విషయం తెలిసిందే. అందుకే గత రాజకీయాలను గమనిస్తే.. గెలిచింది ఒక పార్టీ నుంచి అయితే.. తర్వాత అధికార పార్టీలోకి వలస వచ్చిన వారు ఎందరో కనిపిస్తారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఈ క్రమంలో వలసల జోరు పెరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. అందులో మొదటి బోణి, భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) తెల్లం వెంకట్రావ్ (Tellam Venkatarao) కొడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా తాను బీఆర్ఎస్ (BRS) వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తోన్న వార్తలపై తెల్లం వెంకట్రావ్ క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఇక ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున తెల్లం వెంకట్రావు గెలుపొందారు.
మరోవైపు తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెల్లం వెంకట్రావ్ తెలిపారు. తనపై నమ్మకంతో కేసీఆర్ టికెట్ ఇచ్చారని.. బీఆర్ఎస్ పార్టీ వీడి తాను వెల్లనని వెంకట్రావ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో 9 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా.. ఒక్క భద్రాచలం నుండే బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు.
కాగా కాంగ్రెస్ కీలక నేత అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, తెల్లం వెంకట్రావు కీలక అనుచరుడనే పేరు ఉంది. ఈ నేపథ్యంలో తెల్లం వెంకట్రావు కూడా కారు దిగి హస్తం గూటికి చేరుతారనే టాక్ రాజకీయ వర్గాలలో జోరుగా వినిపిస్తుంది. కానీ వెంకట్రావు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇలాంటి మాటలు ఎంత మంది నేతల నోటి నుంచి వినలేదు.. ముందు లేదంటారు.. తర్వాత నియోజక వర్గం అభివృద్ది కోసం తప్పలేదు అంటారని స్థానిక జనం అనుకుంటున్నారు..