తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) విజయం సాధించడంతో.. ఆపార్టీ నేతలు సీఎం అభ్యర్థిపై ఫోకస్ పెట్టారు. సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ తరఫున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా సీఎం ఎవరనేది నిర్ణయించనున్నారు ఎమ్మెల్యేలు. సీఎల్పీ నేత ఎన్నికపై స్పష్టత వస్తే రాత్రికి ప్రమాణ స్వీకారం ఉంటుంది.
ఇటు రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కార్యక్రమానికి ముందస్తుగానే అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే టెంట్లు, ఫర్నీచర్ అక్కడకు చేరిపోయాయి. సీఎం ఎవరనేది కాసేపట్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
సీఎం ఎవరు కాబోతున్నారనే అంశం ఉత్కంఠను రేపుతోంది. ఈ ఎంపికకు సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవడానికి హైదరాబాద్ లోని హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం జరుగుతోంది. అంతకుముందు, పార్క్ హయత్ హోటల్ లో డీకే శివకుమార్ తో కాంగ్రెస్ సీనియర్లు మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. వీళ్ల ముగ్గురు సీఎం రేసులో ఉన్నవారే కావడంతో ఆసక్తికరంగా మారింది.
సీఎల్పీ సమావేశంలో సీఎం కోసం ఏకవాక్య తీర్మానం చేయబోతున్నారు. పదవి విషయంలో రేవంత్ రెడ్డికి హైకమాండ్ మాట ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి.